తెలుగు సినిమాకు మలయాళీ విలన్ల తాకిడి

టాలీవుడ్ లో హీరోయిన్ల లాగే విలన్ల కొరత మనకు ఎక్కువగానే ఉంది. రావు రమేష్ క్రమంగా క్యారెక్టర్ వేషాలకు మొగ్గు చూపడం, ప్రకాష్ రాజ్ ఎప్పుడో రొటీన్ కావడం లాంటి కారణాల వల్ల ఇతర బాషల నుంచి ప్రతినాయకులను తీసుకురావాల్సి వస్తోంది. నిన్న విడుదలైన నితిన్ ఎక్స్ ట్రాడినరిలో మెయిన్ విలన్ గా ‘సుదేవ్ నాయర్’ని చూపించారు. ఇతను ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావులో కూడా కీలకమైన పాత్ర చేశాడు. ఎలమందగా నటించిన హరీష్ పేరడి తమ్ముడిగా రవితేజతో చాలా వయోలెంట్ గా తల నరికించుకునే క్యారెక్టర్ గా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు.

అందులో పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప పేరు రాలేదు కానీ దర్శకుడు వక్కంతం వంశీ అంతకు ముందే ఏరికోరి మరీ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ కోసం తీసుకొచ్చాడు. ఇతనొక్కడితో ఇది పరిమితం కాదు. దసరాకు ‘షైన్ టామ్ చాకో’ని శ్రీకాంత్ ఓదెల తీసుకొస్తే నానికి సవాల్ విసిరే పాత్రలో మెరిశాడు. రంగబలిలోనూ చేసాడు కానీ దాని డిజాస్టర్ ఫలితం ఆఫర్ల మీద ప్రభావం చూపించింది. మొన్న శుక్రవారం విడుదలైన ఆదికేశవ కోసం మల్లువుడ్ లో బాగా డిమాండ్ ఉన్న ‘జీజు జార్జ్’ని కోరి మరీ తీసుకొచ్చారు. మరీ రొటీన్ విలనిజంతో టాలెంట్ ని వాడుకోలేదు కానీ లేదంటే ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ మాములుగా ఉండదు.

ఇంకా వెనక్కు వెళ్తే పుష్పతో మనకు దగ్గరైన ‘ఫహద్ ఫాసిల్’ కూడా కేరళ బ్యాచే. తండ్రి, విలన్ వేషాలు బాగా పడుతున్న ‘జయరాం’తో మన పరిచయం ఈ మధ్యే పెరిగింది. ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ అక్కడ బిజీగా ఉన్నా తెలుగు అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే సంకల్పంతో ఒప్పుకుంటున్న బాపతే. కాకపోతే ఒకప్పుడు హిందీ నుంచి వచ్చిన షియాజీ షిండే, ముఖేష్ ఋషి, ఆశిష్ విద్యార్ధి లాగా గట్టి జెండా పాతలేకపోతున్నారు. ఫహద్ ఒకడే అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి మలయాళం విలన్లు క్రమంగా టాలీవుడ్ తెరను ఆక్రమించుకునే పనిలో ఉన్నారు