న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న డిసెంబర్ 7 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లు వెరైటీగా చేస్తున్నారు. వారం నుంచే యాక్టివ్ గా ఉన్న నానికి టీమ్ ఇస్తున్న క్రియేటివ్ ఇన్పుట్స్ సోషల్ మీడియాకు వైరల్ కంటెంట్ ఇస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దాన్ని కూడా పబ్లిసిటీ అస్త్రంగా వాడుకునే ఒక వీడియో క్లిప్ చేయించారు. ఇందులో రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన నాని ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు వెరైటీ సమాధానాలు చెప్పడంతో మంచి టైమింగ్ సెన్స్ తో పాటు నాని కామెడీ పంచ్ తో నవ్వించేలా ఉన్నాయి.
మొదలుపెట్టడమే నాని టిడిపి నేత లోకేష్ స్టైల్ ని అనుసరించాడు. మైకులు సరిచూసుకుంటూ ఇంకా ఎవరు రాలేదంటూ హాలీవుడ్ కంపెనీలను ప్రస్తావించి చురకలు వేశాడు. గతంలో తాను చేసిన కిరాణా కొట్టు కామెంట్లను ఉద్దేశించి వాటినే పట్టుకుని వేలాడే వాళ్లకు ఆదాయం పెంచే మార్గాలు చూస్తామని ఇంకో కౌంటర్ ఇచ్చాడు. శ్యామ్ సింగ రాయ్ టైంలో టికెట్ రేట్ల నియంత్రణ గురించి మాట్లాడితే ఏపీ అధికార పార్టీ నేతలు నానిని టార్గెట్ చేసుకున్న సంగతి అభిమానులు మర్చిపోలేదు. దాన్ని మళ్ళీ గుర్తు చేయడం ద్వారా నాని తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పినట్టు అయ్యింది.
చివర్లో యాంకర్ సుమ ఒక జర్నలిస్ట్ మధ్య స్నాక్స్ కి సంబంధించి ఏర్పడ్డ ఇష్యూ గురించి మాట్లాడుతూ తాను ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ముగించేశాడు. మధ్యలో మాట్లాడుతూ అమెరికాలో సుదర్శన్, దేవి థియేటర్లు కట్టించడం, రీల్స్ చేసుకునేవాళ్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంచి పెట్టడం లాంటి జోకులు ఉన్నాయి. మొత్తానికి నాని సరదాగా చేసినా కూడా ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసుకునే ఎంటర్ టైన్మెంట్ అయితే ఇచ్చాడు. హాయ్ నాన్న ఒక రోజు ముందే గురువారం రావడం కూడా ముందస్తు ఎన్నికల టైపని చెప్పడం కొసమెరుపు. సందర్భోచిత ప్రమోషనంటే ఇదేనేమో.