మిడ్ రేంజ్ హీరోల చూపు ‘దూత’ వైపు

అక్కినేని అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు దూత స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. నాగ చైతన్య డిజిటల్ డెబ్యూగా దీని మీద ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 1 నుంచి అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. నలభై నుంచి యాభై నిమిషాల మధ్య నిడివితో మొత్తం ఎనిమిది భాగాలుగా రానుంది. అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా డేట్ ని కన్ఫర్మ్ చేసింది. మనం, 24, నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన దూతలో చైతు మొదటి సారి హారర్ జానర్ టచ్ చేశాడు. అయితే ఇది కేవలం దెయ్యాల కాన్సెప్ట్ మాత్రమే కాదట.

మన చుట్టూ జరుగుతున్న అంతుచిక్కని మరణాల వెనుక ఉన్న రహస్యాలు, విభ్రాంతి కలిగించే రీతిలో ఉన్న వాటి మధ్య కనెక్షన్లు, చనిపోయాక మనుషులు ఆత్మలుగా తిరుగాడే పద్ధతులు ఇవన్నీ దూతలో టచ్ చేశారని తెలిసింది. పోస్టర్ లోనూ కొన్ని క్లూస్ ఇచ్చారు. పత్రికల్లో వచ్చే చావుకు సంబంధించిన హెడ్ లైన్స్ ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. వాటి వైపు గొడుగు పట్టుకుని దేనికోసమో వెతుకుతున్న చైతు స్టిల్ చూస్తే సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్ అయితే కలుగుతోంది. తెలుగుతో పాటు మొత్తం అయిదు భాషల్లో దూత వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.

నాగచైతన్య రేంజ్ టయర్ టూ స్టార్ హీరో ఇంత పెద్ద వెబ్ సిరీస్ చేయడం ఇదే మొదలు. గత కొంత కాలంగా ఈ విభాగంలో వెనుకబడిన ప్రైమ్ దూత తనకు మంచి పికప్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదలకు ఎందుకు జాప్యం చేశారో మాత్రం అంతు చిక్కడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు లేటయ్యాయనే టాక్ ఉంది. ఇండియా న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ నుంచి ప్రమోషన్లు షురూ చేశారు. దీని కోసమే చైతు ముంబైకి వెళ్ళాడు. ఒకవేళ దూత కనక బ్లాక్ బస్టర్ అయితే మరికొందరు ఇదే బాట పట్టే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం.