ఒక బ్లాక్ బస్టర్, కల్ట్ మూవీ చేసిన హీరో, దర్శకుడి కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి కచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆశ్చర్యంగా నాయకుడు లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కమల్ హాసన్, మణిరత్నం మాత్రం 40 ఏళ్ల పాటు ఇంకో సినిమానే చేయలేదు. మళ్లీ ఈ కలయికలో ఒక సినిమా వస్తుందని ఎవరూ ఊహించని సమయంలో గత ఏడాది కొత్త సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచారు ఈ లెజెండ్స్.
రీసెంట్ గా ఈ సినిమా టైటిల్, టీజర్ కూడా లాంచ్ అయ్యాయి. థగ్ లైఫ్ అనే క్రేజీ టైటిల్‌తో వీరి కలయికలో సినిమా రాబోతోంది. టీజర్ చూస్తే కమల్, మణిరత్నం కలిసి కమర్షియల్ హంగులున్న మంచి యాక్షన్ మూవీ చేయబోతున్నారని అర్థమైంది. ఇది వీళ్లిద్దరి కామన్ అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేసింది. ఇక టీజర్లో కమల్ తన పాత్ర పేరు చెబుతూ.. దాన్ని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పిన విధానం అందరి దృష్టినీ ఆకర్షించింది.
రంగరాజన్ శక్తివేల్ నాయకర్.. ఇదీ కమల్ పాత్ర పేరు. ఇందులో శక్తివేల్ అన్నది నాయకన్ సినిమాలో కమల్ మనవడి పేరు. ఒక సీన్లో మనవడిని పేరు అడిగి తెలుసుకుని.. తన పేరు కలిసి వచ్చేలాగే అతడికి పేరు పెట్టాడని తెలుసుకుని ఎమోషనల్ అవుతాడు కమల్. ఇప్పుడు శక్తివేల్ నాయకర్ అనే పేరుతో కమల్ వస్తుండటంతో నాటి నాయకుడు సినిమాలోని మనవడే ఇందులో హీరో అనే సంకేతాలు వస్తున్నాయి.
కాగా కమల్ పేరులో రంగరాజన్ అని ఉండడంతో దశావతారం ఆరంభంలో కనిపించే పాత్రతో ఈ సినిమాకు లింక్ ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు థగ్ లైఫ్ టీజర్‌కు.. 1961లో వచ్చిన యోజింబో అనే ఒక జపనీస్ సినిమాతో పోలికలు కనిస్తుండటం గమనార్హం. ఆ సినిమా పోస్టర్లు చూస్తే టీజర్లో చూపించిన షాట్లతో పోలిక కనిపిస్తోంది. ఐతే కాన్సెప్ట్ టీజర్ వరకే స్ఫూర్తి పొందారా లేక కథ విషయంలోనూ ఇన్‌స్పైర్ అయ్యారా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో మాత్రం టీం విజయవంతమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates