పాన్ ఇండియా.. ‘బాహుబలి’ సినిమా వచ్చే ముందు వరకు ఈ మాటే ఎవరికీ పరిచయం లేదు. కానీ ఆ సినిమా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు సాధించి ఈ మాటను పాపులర్ చేసింది. అప్పట్నుంచి దేశం మొత్తాన్ని మెప్పించేలా సినిమాలు తీయాలని, అన్ని చోట్లా వసూళ్లు రాబట్టాలని దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించి ‘పాన్ ఇండియా’ హిట్లుగా నిలిచాయి. ‘కార్తికేయ-2’ లాంటి చిన్న సినిమాలు కూడా కొన్ని ప్రభావం చూపాయి.
కానీ వీటిని అనుకరిస్తూ మిగతా వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం బెడిసికొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టేవిగా ఉంటే.. ‘పాన్ ఇండియా’ సినిమాలుగా ప్రమోట్ చేసి అడ్రస్ లేకుండా పోయిన సినిమాల జాబితా తీస్తే చాంతాడంత ఉంటోంది. అనౌన్స్‌మెంట్ నుంచే పాన్ ఇండియా పాన్ ఇండియా అని హడావుడి చేసి.. చివరికి రిలీజ్ టైంలో వేరే భాషల్లో కనీస స్థాయిలో కూడా సౌండ్ చేయని సినిమాలు ఎన్నో. పోస్టర్ల మీద నాలుగైదు భాషల పేర్లు ఘనంగా వేసేస్తున్నారు కానీ.. చాలా వరకు సినిమాలు ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజవుతున్నాయి.
కొన్ని అయితే ఆ ప్రకటించిన భాషల్లో రిలీజ్ కూడా కావడం లేదు. ‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షన్‌తోనే ఇతర భాషల్లో క్రేజ్ తెచ్చుకున్నాడని విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ను దక్షిణాదిన మిగతా భాషలన్నింట్లో రిలీజ్ చేశాడు. కానీ అది కనీస ప్రభావం కూడా చూపలేదు. ‘లైగర్’ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా చేశాడు. దాని ఫలితం తెలిసిందే. ‘ఖుషి’కి అంత హడావుడి చేయకున్నా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తే తమిళంలో మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. మిగతా భాషల్లో ప్రభావం చూపలేదు. నిఖిల్‌కు ‘కార్తికేయ-2’తో క్రేజ్ వచ్చిందని ‘స్పై’ను ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు.
నాని ‘దసరా’ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే ప్రభావం చూపలేదు. సమంత ‘శాకుంతలం’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా సినిమాగా రిలీజైంది. ఐతే హిందీలో బాగా ప్రమోట్ చేసినా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళంలో రిలీజ్ సమస్యలు తలెత్తి వాయిదా పడి కనుమరుగైపోయింది. తెలుగులో కూడా ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇలా చాలా సినిమాలు ‘పాన్ ఇండియా’ ముద్రతో మొదలై.. కనీస ప్రభావం చూపకుండా తెరమరుగైపోతున్నాయి.