పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న కొత్త సినిమా.. కీడా కోలా. చేసింది రెండు సినిమాలే అయినా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తరుణ్. అందుకే తన కొత్త సినిమా మీద కూడా యువ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అతడి సినిమా అంటే కొత్తగా, క్రేజీగా ఉంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. కీడా కోలా అనే టైటిల్‌తోనే అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా కొత్తగా, క్రేజీగానే కనిపించాయి. ప్రోమోలు చూస్తే కథ మీద పెద్దగా ఐడియా రాలేదు కానీ.. ఒక కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూ తిరిగే కథ ఇదని మాత్రం అర్థమైంది. ఐతే కథ గురించి పూర్తి డీటైల్స్ చెప్పకపోయినా.. ఈ కథకు పునాది ఏంటో, కోర్ ప్లాట్ పాయింట్ ఏంటో ‘కీడా కోలా’ మీడియా ఇంటర్వ్యూల్లో తరుణ్ భాస్కర్ బయటపెట్టేశాడు. కరోనా సమయంలో పరిస్థితులు చూసి ఈ కథ రాసుకున్నట్లు తరుణ్ వెల్లడించాడు.
కరోనా టైంలో జనాలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. డబ్బులు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని.. అందులో భాగంగా ఒక వ్యక్తి మ్యాన్ హోల్ మూత తీసి ఇనుప సామాన్ల వాళ్లకు అమ్మేశాడనే వార్తను తాను మీడియాలో చదివానని.. ఆ ఘటన నుంచి పుట్టిన కథే ‘కీడా కోలా’ అని చెప్పాడు తరుణ్. వక్ర మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే ఒక యువకుడు.. తాను తాకే కూల్ డ్రింక్‌లో పురుగు పడిందని కేసు వేస్తాడని.. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటన్నదే ఈ సినిమా అని తరుణ్ వెల్లడించాడు.
చిన్నప్పట్నుంచి తనకు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా ఇష్టమని.. ‘మనీ’, ‘మనీ మనీ’ సినిమాలను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని తరుణ్ తెలిపాడు. తమిళంలో వచ్చిన సూదుకవ్వుం, జిగర్‌తండ సినిమాలు కూడా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని.. ఎట్టకేలకు తనకెంతో నచ్చిన జానర్లో ‘కీడా కోలా’ తీశానని.. ఇది కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.