ఆదికేశవ వాయిదా – తెలివైన నిర్ణయం

ఇంకో పది రోజుల్లో విడుదలకు సిద్ధమైన వైష్ణవ్ తేజ్ ఆదికేశవ అనూహ్యంగా వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు. నిజానికి గత రెండు మూడు రోజులుగా మెగా హీరో సినిమా ప్రమోషన్లు తగిన స్థాయిలో జరగడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దానికి కారణాలు కూడా వివరించారు. మంచి కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు అనవసరంగా పోటీకి వెళ్లి రెవిన్యూ షేర్ చేసుకోవడం కంటే డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త డేట్ గురించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చామని క్లారిటీ ఇచ్చారు.

కొత్త డెసిషన్ ప్రకారం ఆదికేశవ నవంబర్ 24 రిలీజ్ కానుంది. పదో తేదీన చాలా రిస్కులున్నాయి. సల్మాన్ ఖాన్ టైగర్ 3, కార్తీ జపాన్, లారెన్స్ జిగర్ తండా డబుల్ ఎక్స్, ది మార్వెల్స్ పోటీ పడుతున్నాయి. పేరుకి డబ్బింగ్ అయినా మన ఆడియన్స్ లోనూ వీటి పట్ల క్రేజ్ ఉంది. ట్రైలర్లు చూశాక కంటెంట్ మీద ఆసక్తి పెరిగింది. పైగా దీపావళి నుంచి రెండు సెమి ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచులు, ఒక తుది పోరాటం ఉన్నాయి. ఇండియా ఖచ్చితంగా వీటికి వెళ్తుంది కాబట్టి జనాలు మొత్తం క్రికెట్ ఫీవర్ లో ఉంటారు. అలాంటప్పుడు అనవసరంగా మూడు రోజుల వసూళ్లకు కోత పడుతుంది.

ఇవన్నీ ఆలోచించే ఆదికేశవని 24కి షిఫ్ట్ చేయడం మంచిదే అయ్యింది. కళ్యాణ్ రామ్ డెవిల్ సిజి వర్క్స్ వల్ల తప్పుకోవడంతో అది కాస్తా వైష్ణవ్ తేజ్ కి కలిసి వచ్చేలా ఉంది. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కూడా అదే డేట్ తీసుకుంది కానీ అంత టెన్షన్ పడాల్సిన పోటీ అయితే కాదు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆదికేశవలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భగవంత్ కేసరి ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొని ఇప్పుడు ఆదికేశవ కోసం డేట్లు ఇవ్వబోతోంది. ఏదైతేనేం బజ్ పెంచుకోవడానికి, ఈవెంట్లు చేసుకోవడానికి మెగా టీమ్ కి అవసరమైన సమయమైతే దొరికేసింది. ఇక ప్లాన్ చేసుకోవడమే తరువాయి.