‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ మార్కెట్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయికి పెరిగాయో తెలిసిందే. అంతకుముందు 100-200 కోట్ల మధ్య బడ్జెట్ అంటే అమ్మో అనుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఇండియాలో రూ.500 కోట్ల బడ్జెట్లు పెట్టి భయపడకుండా సినిమాలు తీసేస్తున్నారంటే ‘బాహుబలి’ పుణ్యమే. ఇలా భారీ బడ్జెట్ సినిమాల్లో చాలా వరకు ప్రభాస్ హీరోగానే తెరకెక్కుతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా రూ.300 కోట్లకు తక్కువ బడ్జెట్లో తెరకెక్కలేదు.
ప్రభాస్ క్రేజ్ వల్ల బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. కానీ తమ సినిమాలకు అవసరం లేని హంగులు జోడించి బడ్జెట్లు పెంచేస్తున్న నిర్మాతలు.. బిజినెస్ పరంగా కూడా భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. చాలా రిస్కీ అనిపించే స్థాయిలో బయ్యర్లకు సినిమాను అమ్ముతున్నారు. అది ప్రభాస్‌కు బాక్సాఫీస్ దగ్గర మోయలేని భారంగా మారుతోంది. టాక్ బాగుంటే ఎలాగోలా లాక్కొచ్చేసేవాడు కానీ.. గత మూడు చిత్రాల్లో దేనికీ సరైన టాక్ రాకపోవడంతో అవి భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.
కనీసం ‘సలార్’తో అయినా ప్రభాస్ ఓ మంచి హిట్ కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఐతే ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే ‘సలార్’కు తక్కువ ఖర్చే అయినా.. నిర్మాతలు మాత్రం ఈ సినిమా నుంచి వీలైనంత ఎక్కువగా దండుకుందామని చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘సలార్’కు ఉన్న క్రేజ్‌కు చాలా ముందుగానే బిజినెస్ అయిపోవాల్సింది కానీ.. నిర్మాతల రేట్లు కొండెక్కి కూర్చోవడంతో ఇంకా కూడా ఓవరాల్ బిజినెస్ క్లోజ్ కాలేదు. తాజాగా తెలుగు రాష్ట్రాల బిజినెస్ పూర్తయినట్లు చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణకు కలిపి రేటు రూ.175 కోట్లు పలికిందట. రూ.300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదట. సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా సరే.. ఈ మార్కు మరీ టూమచ్. తిరుగులేని టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఇక బయ్యర్లు అయిన కాడికి టికెట్ల రేట్లు పెంచడం ఖాయం. ఆ రేట్లతో ప్రేక్షకులు సంతృప్తిగా సినిమా చూడలేరు. టాక్ బాగుంటే ఓకే కానీ.. ఏమైనా తేడా వస్తే మాత్రం సినిమాను నమ్ముకున్న వాళ్లందరూ మునగడం ఖాయం. అప్పుడు ఆటోమేటిగ్గా ప్రభాస్‌కు మైనస్ అయి డిజాస్టర్ హీరోగా ముద్ర పడి.. తర్వాతి సినిమాల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది.