త్రిముఖ యుద్ధానికి సర్వం సిద్ధం

దసరాకు ఇంకా వారం రోజులు టైం ఉండగానే టాలీవుడ్ బాక్సాఫీస్ కు ముందే పండగ కళ వచ్చేస్తోంది. రెండు వారాలకు పైగా ఒక్క మ్యాడ్ తప్ప సరైన సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా ఉండటంతో భోరుమంటున్న బయ్యర్లు రేపటి నుంచి హౌస్ ఫుల్ బోర్డులు చూసేందుకు రెడీ అవుతున్నారు. రేపు భగవంత్ కేసరి, లియోలు పరస్పరం తలపడుతున్నాయి. బాలయ్య మరోసారి మాస్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ కాగా ఈసారి  ప్రత్యేకంగా ఎమోషన్స్ ఉన్న కథలో నటించడం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఊహించని విధంగా లియో అడ్వాన్స్ బుకింగ్స్ షాక్ ఇస్తున్నాయి. ఏదో హైదరాబాద్ లాంటి నగరాల్లో అంటే ఏమో అనుకోవచ్చు. జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్లలో సైతం  అమ్మకాలు దూకుడుగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం 7 గంటలకు షోలు వేస్తున్నా గంటల వ్యవధిలో సోల్డ్ అవుట్ కావడం షాక్ కలిగిస్తోంది. భగవంత్ కేసరికి ఈ ట్రెండ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ విజయ్ సినిమాకి ఇలాంటి క్రేజ్ ఊహకందనిది. తెలుగు రాష్ట్రాల నుంచి అడ్వాన్స్ రూపంలో రెండు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

ఒక రోజు ఆలస్యంగా రావడం టైగర్ నాగేశ్వరరావుకు మేలు కంటే చేటే చేస్తునట్టు కనిపిస్తోంది. అమ్మకాలు కాస్త నెమ్మదిగా ఉన్నాయి. అందరి దృష్టి బాలయ్య, విజయ్ ల మీద ఎక్కువ ఉండటంతో రవితేజ ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినా టాక్ తో జనాన్ని థియేటర్లకు రప్పించాల్సి ఉంటుంది. ఓపెనింగ్ పరంగా డౌట్ లేదు కానీ కాస్త తక్కువగా ఉన్న బజ్ పికప్ కావాలంటే ఎక్స్ ట్రాడినరి రిపోర్ట్స్ రావాలి. వీటి మధ్యలో టైగర్ శ్రోఫ్ గణపథ్ ని మన జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు డబ్బింగ్ ఉన్నప్పటికీ స్క్రీన్లు అందుబాటులో లేకపోవడం రిలీజ్ ని పరిమితం చేయనుంది.