లియో.. అన్నీ నెగెటివ్ అవుతున్నాయ్

ఒక రెండు వారాల ముందు వరకు ‘లియో’ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. తమిళం అనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి హైప్ కనిపించింది. దసరాకు ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పటికీ.. దీని క్రేజ్ దీనిదే అన్నట్లుండేది. అందుక్కారణం.. హీరో విజయ్ కంటే కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు ఇక్కడున్న క్రేజే కారణం.

‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలకు ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు.. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు పెడుతున్నారు. ‘లియో’ కూడా ఆ యూనివర్శ్‌లో భాగమనే అని వాళ్లు భావిస్తున్నారు. ఇక ‘జైలర్’ సినిమాను తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ ఎలా పైకి లేపాడో తెలిసిందే. ‘లియో’లో కూడా అతడి మ్యాజిక్ చూస్తామని భారీ అంచనాలతో ఉన్నారు.

ఐతే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘లియో’ మీద అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. ట్రైలర్ అంచనాలకు ఏమాత్రం తగని విధంగా ఉండటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రేక్షకులు. కేవలం ట్రైలర్ చూసి సినిమా ఒక అంచనాకు రావొద్దని, సినిమాలో అనేక సర్ప్రైజ్‌లు ఉన్నాయని టీం చెబుతున్నప్పటికీ సినిమా పట్ల ఎగ్జైట్మెంట్‌ను ట్రైలర్ తగ్గించేసిందన్నది వాస్తవం. దీనికి తోడు ఈ చిత్రం ‘ఎల్‌సీయూ’లో భాగం కాదన్నట్లుగా లోకేష్ సంకేతాలు ఇవ్వడం.. ఇది ‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’కు ఫ్రీమేక్ అనే ప్రచారం ఊపందుకోవడం కూడా సినిమా పట్ల అంచనాలను తగ్గించేసింది.

ఇప్పటికే తెలుగులో ఇదే కథతో ‘గాయం-2’ రావడం వల్ల ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. ఇక తాజాగా ‘లియో’ నుంచి రిలీజ్ చేసిన ‘నే రెడీ’ పాట అయితే.. ఈ సినిమా డబ్బింగ్ క్వాలిటీ మీద అనేక సందేహాలు రేకెత్తించింది. ‘లియో’ను తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీ.. ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అందుకే పాట క్వాలిటీ అలా తయారైందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ‘లియో’ మీద వరుసగా నెగెటివ్ వార్తలే వస్తుండటం, బజ్ అంతకంతకూ తగ్గిపోతుండటం తెలుగులో దీని రిజల్ట్ మీద సందేహాలు నెలకొనేలా చేస్తోంది.