ఇవాళ విడుదలైన చాలా సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కనీస ఆసక్తిని పెంచేలా లేకపోవడం ట్రేడ్ లో నిస్సత్తువ నెలకొల్పింది. సరే ఏదైనా టాక్ బాగుంటే రేపటి నుంచి జనం వస్తారనే నమ్మకంతో ఎదురు చూశారు. ఉన్న వాటిలో డబ్బింగ్ అయినా సరే క్యాస్టింగ్ వల్ల ఓ వర్గం ప్రేక్షకుల దృష్టిలో పడ్డ మూవీ గాడ్. పొన్నియిన్ సెల్వన్ తో మనకు కాస్త దగ్గరైన జయం రవి హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ కు ఐ అహమ్మద్ దర్శకత్వం వహించారు. తమిళంలో గత నెలే రిలీజ్ కాగా ఇక్కడ థియేటర్ల సమస్య వల్ల రెండు వారాలు ఆలస్యంగా తీసుకొచ్చారు. ఇంతకీ గాడ్ ఎలా ఉన్నాడు.
బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్(రాహుల్ బోస్) అతి కిరాతకంగా అమ్మాయిలను అపహరించి వాళ్ళను హత్య చేసి ఊరవతల శవాలను వదిలేసి వస్తుంటాడు. ఆవేశం ఆణువణువూ ఉన్న పోలీస్ ఆఫీసర్ అర్జున్(జయం రవి) ఎట్టకేలకు వాడిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో బులెట్ గాయాలకు గురైన బ్రహ్మ హాస్పిటల్ లో చేరతాడు. అచ్చం ఇతని స్టైల్ లోనే మర్డర్లు చేస్తున్న మరో అజ్ఞాత హంతకుడు ఈ రాక్షస పర్వాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడో కొత్త సవాల్ మొదలవుతుంది. చర్చి ఫాదర్ చేరదీసిన బాబు(వినోత్ కిషన్) ఈ కేసులో కీలకంగా మారతాడు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడాలి
వెబ్ సిరీస్, సినిమాల్లో బోలెడు సైకో కథలు చూసి జనాలకు బోర్ కొట్టేసింది. ఈ గాడ్ కూడా అదే బాపతే. కాకపోతే ఒక శాడిస్ట్ బదులు ఇద్దరిని పెట్టడం మినహాయించి ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. నయనతార కోసం వెళ్తే నిరాశ తప్పదు. తన పాత్ర నామ మాత్రం. రాహుల్ బోస్, వినోత్ లు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ వయోలెంట్ కంటెంట్ వల్ల ఓవరాక్షన్ అనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ స్టైల్ లోనే ఉంది. రెండు మూడు ట్విస్టులు తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారంగా అనిపించే గాడ్ ని సాగతీత స్క్రీన్ ప్లేతో రెండున్నర గంటలు ఎంత ఓపిగ్గా చూసినా కష్టమే.