పండగ సినిమాలకు క్రికెట్ మ్యాచుల చిక్కు

టాలీవుడ్ బాక్సాఫీస్ ఈసారి దసరా పండగ మీద భారీ పెట్టుబడితో రెడీ అవుతోంది. సంక్రాంతి రేంజ్ లో పోటీకి కోడిపుంజుల తరహాలో హీరోలు కవ్వించుకోవడంతో పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. భగవంత్ కేసరి ట్రైలర్ వచ్చాక అప్పటికే ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. బాలయ్యని తెలంగాణ స్లాంగ్ తో సరికొత్త అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.  లియోకు కొంత ప్రీ నెగటివ్ బజ్ ఉన్నప్పటికీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు హీరో ఇమేజ్ మంచి ఓపెనింగ్ తెచ్చేలా ఉంది.  టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ ప్యాన్ ఇండియా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ముంబైతో స్టార్ట్ చేసి రిలీజ్ టైంకంతా హైదరాబాద్ లో పూర్తి చేస్తారు.

ఇదంతా బాగానే ఉంది కానీ దసరా సినిమాలకు మొదటి పది రోజులు చాలా కీలకం. సెలవులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులు ప్రభావం చూపించే విషయాన్ని కొట్టి పారేయలేం. అక్టోబర్ 19న బాలయ్య, విజయ్ లు వచ్చే రోజే ఇండియా – బంగ్లాదేశ్ పోరు ఉంది. టీవీలో చూసే జనాలు భారీగా ఉంటారు. మూడు రోజులు గడవడం ఆలస్యం 21న ఇండియా – న్యూజిలాండ్ గేమ్ ఉంటుంది. దీనికెంత క్రేజో చెప్పనక్కర్లేదు. వారం గ్యాప్ తో 29న ఇండియా – ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన ఆటకు ఫ్యాన్స్ రెడీ అవుతారు.

అన్నీ ముఖ్యమైన మ్యాచులు అందులో డే నైట్ సాగేవి కావడంతో మధ్యానం నుంచి సెకండ్ షోల దాకా వీటి ప్రభావం గట్టిగానే ఉంటుంది. జనాలందరూ ఇళ్లలోనే ఉంటారని కాదు కానీ క్రికెట్ లవర్స్ మాత్రం నో సినిమా ఓన్లీ గేమ్ అనడం మాత్రం ఖాయం. వీళ్ళ శాతాన్ని తక్కువంచనా వేయలేం. మన దేశం ఆడేవి కాకుండా ఇతర టీములకు సంబంధించి కూడా కొన్ని కీలక మ్యాచులున్నాయి. ఏదైతేనేం ఈ ఎఫెక్ట్ ఎంత స్థాయిలో ఉంటుందనేది సినిమాలకొచ్చే టాక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. బ్లాక్ బస్టర్స్ అనిపించుకుంటే చాలు ఏదోలా వీలు చూసుకుని మరీ థియేటర్ కు వెళ్లేంత సినిమా ప్రేమ టాలీవుడ్ జనాలది.