స్టార్ హీరో వారసుడిని పట్టించుకోలేదు

మాములుగా ఒక పెద్ద హీరో వారసుడు తెరకు పరిచయమవుతుంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తుంటారు. ఇటీవలే గదర్ 2 రూపంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సన్నీ డియోల్ కొడుకు రాజ్ వీర్ డియోల్ డెబ్యూ మూవీ దోనో మొన్న రిలీజయ్యింది. అక్షయ్ కుమార్ మిషన్ రాణి గంజ్ తో పోటీ ఎందుకు లెమ్మని ఒక రోజు ముందు వచ్చింది. మరికొన్ని విశేషాలున్నాయి. హీరోయిన్ గా నటించిన పలోమా ధిల్లాన్ నిన్నటి తరం కథానాయికి పూనమ్ థిల్లాన్ కూతురు. ఈమెకూ ఇది మొదటి చిత్రమే.

దర్శకుడు అవినాష్ ఎస్ బరజాత్య ది కూడా ఈ జంటకు తీసిపోని బ్యాక్ గ్రౌండ్. బాలీవుడ్ కు రికార్డులు తిరగరాసిన మైనే ప్యార్ కియా, హం ఆప్కె హై కౌన్ లాంటి  బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సూరజ్ ఆర్ బరజాత్య కొడుకే ఇతను. ఇంత సెటప్ ఉన్నా దోనోకి కనీస ఓపెనింగ్స్ దక్కలేదు. సినిమా కూడా అంతంతంగా మాత్రంగా ఉండటంతో ఆడియన్స్ దీని మీద ఆసక్తి చూపించలేదు. ఆధునిక ప్రేమలు, బ్రేకప్ లను నేపధ్యంగా తీసుకుని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు ఏదో సందేశం ఇవ్వాలనుకున్న అవినాష్ దానికి బదులు విపరీతంగా బోర్ కొట్టించే క్లాసుని బహుమతిగా ఇచ్చాడు.

స్టోరీ కూడా అరిగిపోయిందే. వ్యక్తిగతంగా బ్రేకప్స్ ఉన్న హీరో హీరోయిన్ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కలుసుకున్నాక జరిగే పరిణామాలను చూపించారు. కథనం, సంగీతం దేనికవే ఆకట్టుకునేలా లేకపోవడంతో ఎప్పుడెప్పుడు అయిపోతుందాని ఎదురు చూడటం తప్ప జనాలకు మరో ఆప్షన్ లేకపోయింది. అసలు సన్నీ డియోల్ కొడుకు వచ్చాడనే విషయమే బయట పబ్లిక్ లో రిజిస్టర్ కాలేదు. దానికి తోడు ఇలాంటి నీరసమైన కథా కథనాలతో తెరంగేట్రం చేస్తే ఫ్లాప్ కాకుండా ఇంకేం దక్కుతుంది. కొందరికి పర్వాలేదనిపించినా ఫైనల్ గా దోనో థియేటర్ కు వచ్చిన వాళ్ళతో నోనో అనిపించేసుకుంది.