ఏకంగా సలార్ ని లక్ష్యంగా పెట్టుకుని దానికి పోటీకి నిలబెట్టి బ్లాక్ బస్టర్ కొడతానని బీరాలు పోయిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ది వ్యాక్సిన్ వార్ రూపంలో డిజాస్టర్ తప్పలేదు. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ మరీ డాక్యుమెంటరీ స్టైల్ లో తీయడం, కరోనా విషాదాలను మళ్ళీ అదే పనిగా టికెట్టు కొని చూసే మూడ్ లో ప్రేక్షకులు లేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. నార్త్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ ని బ్రహ్మాండంగా ఆదరించిన హైదరాబాద్ వాసులు సైతం దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
దీంతో ది వ్యాక్సిన్ వార్ నిర్మాతలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముందు వన్ ప్లస్ వన్ స్కీం పెట్టారు. స్పందన లేదు. ఒకరు వెళ్తే ఫ్రీగా మరొకరు చూడొచ్చన్న అవకాశాన్ని ఆడియన్స్ వద్దనుకున్నారు. ఇప్పుడు కొత్తగా బల్క్ బుకింగ్స్ కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. కాలేజీలు, కార్పొరేట్ సంస్థలు, స్కూళ్ళు ఇలా ఎవరైనా సరే గంపగుత్తగా వెళ్లాలనుకుంటే టీమ్ ని సంప్రదించాలి. దీని వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం ఎవరికి లేదు. నెల రోజుల ముందు నుంచే అమెరికాలో ప్రీమియర్లు వేసుకుంటూ వచ్చినా ఖర్చు తప్ప మిగిలింది ఏమీ లేదు.
వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారం రోజులకు పట్టుమని పది కోట్లు కూడా వసూలు చేయలేని దాన్ని డిజాస్టర్ కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుందని అంటున్నారు. అయినా ఓటిటికి ఫిట్ అయ్యే కంటెంట్ ని థియేటర్ల మీద ప్రయోగిస్తే ఇలాగే జరుగుతుంది. కోవిడ్ కి విరుగుడు కనిపెట్టడంలో మన దేశం పాత్ర గొప్పదే కానీ దాన్ని బిజెపికి ఆపాదించి ఏదో మార్కులు కొట్టేయాలనుకున్న వివేక్ ఎత్తుగడ మాత్రం ఫలించలేదు. దీనికన్నా నాలుగో వారంలో ఉన్న జవాన్ ఎన్నోరెట్లు మెరుగైన వసూళ్లు నమోదు చేయడం గమనార్హం.