విజయ్ దేవరకొండ.. కెరీర్లో తొలిసారి

ఒకప్పుడు సీక్వెల్స్, పార్ట్-2 లాంటి డిస్కషన్లే పెద్దగా ఉండేవి కావు టాలీవుడ్లో. ఎప్పుడో ఒకసారి సీక్వెల్ తీసినా.. వాటికి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వాటి జోలికే వెళ్లేవాళ్లు కాదు ఫిలిం మేకర్స్. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు మారిపోయాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు సెకండ్ పార్ట్ పేరుతో మంచి క్రేజ్ సంపాదించడమే కాక ఊహించని స్థాయిలో ఆదాయం అందుకోవడంతో అందరికీ వాటి మీద ఆశ పుట్టింది.

తర్వాత సినిమా తీస్తామో లేదో.. ముందు సీక్వెల్ లేదా సెకండ్ పార్ట్ దిశగా హింట్ ఇచ్చేస్తున్నారు. సినిమా ఫలితాన్ని బట్టి కొందరు కొనసాగింపుగా మరో చిత్రం తీస్తున్నారు. లేదంటే సైలెంట్ అయిపోతున్నారు. ఈ వారం రిలీజైన ‘స్కంద’ సినిమాకు కూడా సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న మరో క్రేజీ మూవీని రెండు భాగాలుగా తీయాలని డిసైడైనట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న కొత్త చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ముందు ఒక సినిమాగానే తీయాలనుకున్నప్పటికీ.. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత, స్క్రిప్ట్ డెవలప్మెంట్‌ను బట్టి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని డిసైడయ్యారట. కథ విస్తృతి దృష్ట్యా ఒక భాగంలో తీయడం కష్టమని గౌతమ్ అండ్ కో ఫిక్సయ్యారట.

త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నట్లు తెలిసింది. విజయ్ కెరీర్లో రెండు భాగాలుగా రానున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రానికి ముందు శ్రీలీలను కథానాయికగా అనుకున్నప్పటికీ.. డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తన స్థానంలోకి రష్మిక మందన్నా వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సైనికుడి పాత్ర చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో పార్ట్-1 విడుదలయ్యే అవకాశముంది.