హ‌వ్వ.. ఈ సినిమా రీ రిలీజా?

టాలీవుడ్లో ఏడాదిగా పాత సినిమాల రీ రిలీజ్ హంగామా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. పాత సినిమాల‌కు స్పెష‌ల్ షోలు వేయ‌డం కొత్తేమీ కాదు కానీ.. స్టార్ హీరోల పుట్టిన రోజు నాడు ఒక‌ట్రెండు షోల‌తో స‌రిపెట్టేవాళ్లు. కానీ వంద‌లు, వేల సంఖ్య‌లో షోలు వేయడం, కొత్త సినిమాల‌ను మించి థియేట‌ర్ల‌లో అభిమానులు సంద‌డి చేయ‌డం.. హిట్, ఫ్లాప్.. స్ట్రెయిట్, డ‌బ్బింగ్ అని తేడా లేకుండా పాత సినిమాల‌ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ‌టంతో ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది.

గ‌త ఏడాది మ‌హేష్ బాబు పుట్టిన రోజు నాడు వ‌చ్చిన‌ పోకిరితో మొద‌లుపెడితే ప‌దుల సంఖ్య‌లో సినిమాలు వ‌చ్చాయి. వాటిలో చాలా వ‌ర‌కు మంచి ఫ‌లితాన్నే అందుకున్నాయి. కొన్ని ఫ్లాప్ సినిమాల‌కు సైతం భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. అనువాద చిత్రాల‌కు సైతం అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. లేటెస్ట్‌గా 7జి బృందావ‌న కాల‌నీ సినిమాను ఎగ‌బ‌డి  చూస్తున్నారు మ‌న‌ ఆడియ‌న్స్.

ఈ క్ర‌మంలోనే ఒక ఆశ్చ‌ర్య‌క‌ర రీ రిలీజ్ గురించి అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఆ సినిమా పేరు.. ర‌తి నిర్వేదం. ఈ సినిమా టైటిల్ చూసే ఇదెలాంటి సినిమానో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ల‌యాళ సాఫ్ట్ పోర్న్ సినిమాలు తెలుగు కుర్ర‌కారును ఊపేస్తున్న రోజుల్లో వ‌చ్చిన బిగ్రేడ్ మూవీ అది.

ఒక న‌డి వ‌య‌స్కురాలితో ప్రేమ‌లో ప‌డి ఆమెతో శృంగార సంబంధం పెట్టుకునే క‌థ ఇది. శ్వేతా మీన‌న్ లీడ్ రోల్ చేసింది. అప్ప‌ట్లో ఈ సినిమా శృంగార ప్రియుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి సినిమాను రీ రిలీజ్ చేయాల‌ని డిసైడై అనౌన్స్‌మెంట్ ఇవ్వ‌డం అంటే వైప‌రీత్యం అనే అనుకోవాలి. అయినా అప్ప‌ట్లో ఇంట‌ర్నెట్ త‌క్కువ‌గా అందుబాటులో ఉన్న‌పుడు ఇలాంటి సినిమాల‌ను ఎగ‌బ‌డి చూసేవాళ్లు కానీ.. ఇప్పుడు వీటి కోసం ఎవ‌రు ఎగ‌బ‌డ‌తారో చూడాలి.