కోలీవుడ్లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తనయురాలు మీరా ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచి వేసింది. 14వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మీరా డిప్రెషన్ కారణంగా తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఇంతకుమించి వివరాలేమీ బయటికి రాలేదు. మీరా మృతితో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నడూ ఏ వివాదంలో చిక్కుకోని.. ఎప్పుడూ ఎంతో అణకువతో కనిపించే విజయ్ ఆంటోనీ ఇలాంటి విషాదం చూడాల్సి రావడం అందరినీ వేదనకు గురి చేస్తోంది. మీడియాతో కూడా చాలా తక్కువ మాట్లాడే విజయ్ ఆంటోనీ.. ఆత్మహత్యకు వ్యతిరేకంగా జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ప్రచారకర్తగా పాల్గొనడం గమనార్హం. ఒకప్పుడు అతను ఆ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పని.. జీవితంలో ఎంత కష్టం వచ్చినా నిలబడి ఎదుర్కోవాలే తప్ప.. మన ప్రాణాలను మనం తీసుకుని కుటుంబ సభ్యులకు శోకం మిగల్చడం పాపమని విజయ్ ఓ కార్యక్రమంలో చెప్పాడు. అంతే కాక తమ కుటుంబం ఆత్మహత్య బాధితులమే అంటూ తనకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయాన్ని అతను ఆవేదనా భరితంగా చెప్పుకున్నాడు.
ఆ సమయంలో తన తల్లి తనతో పాటు చెల్లెలి బాధ్యత తీసుకుని కుటుంబాన్ని కష్టపడి పోషించిందని చెప్పాడు. కుటుంబంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. తాను ఎంతో బాధ అనుభవించి, కష్టాలు పడ్డానని.. తాను అన్నీ చూశానని.. అందుకే తాను ఎక్కువగా మాట్లాడనని ఆ ప్రసంగంలో విజయ్ పేర్కొన్నాడు. అప్పుడు తండ్రిని కోల్పోయి కష్టపడ్డ విజయ్.. ఇప్పుడు కూతురిని పోగొట్టుకుని ఎంత బాధ పడుతుంటాడో అని అందరూ తనపై సానుభూతి చూపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates