రాస్కోరా సాంబా.. ఇంకో వెయ్యి కోట్లు

ఐదేళ్ల కిందట వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా ‘జీరో’ ఫుల్ రన్లో వంద కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు కూడా చాలానే డిజాస్టర్లయ్యాయి. ఇలా వరుస ఫెయిల్యూర్లు చూసిన హీరో నుంచి కమ్ బ్యాక్‌లో వెయ్యి కోట్ల సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్.. షారుఖ్ హీరోగా తీసిన ‘పఠాన్’ ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా చూస్తే అంత గొప్పగా ఏమీ కనిపించదు. సగటు కమర్షియల్ స్టయిల్లో సాగే యాక్షన్ మూవీ అది. కానీ సినిమాకు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా కలిసొచ్చాయి. అలా ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కును అలవోకగా దాటేసింది. ఐతే అన్నిసార్లూ బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్‌లు జరగవనే అనుకుంటారు.

కానీ షారుఖ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలాగే కనిపిస్తున్నాడు. ఆయన కొత్త సినిమా ‘జవాన్’కు సైతం రిలీజ్ ముంగిట మాంచి హైప్ వచ్చింది. ‘పఠాన్’ సహా చాలా బాలీవుడ్ సినిమాల వసూళ్ల రికార్డులను ఈ సినిమా తిరగరాయడం ఖాయమని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే అర్థమైంది. ఇక రిలీజ్ రోజు ఈ సినిమా హంగామా మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ భేదాలు లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సౌత్ సిటీస్ సైతం ‘జవాన్’ ఫీవర్‌తో ఊగిపోయాయి. లోకల్ సినిమాలను వెనక్కి నెట్టి ‘జవాన్’ బాక్సాఫీస్‌ను పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఇక నార్త్ ఇండియాలో అయితే హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రానికి కూడా ‘పఠాన్’ లాగే యావరేజ్ టాక్ వచ్చింది. కానీ కథ పరంగా రొటీన్ అయినా.. షారుఖ్ అభిమానులతో పాటు మాస్, యాక్షన్ లవర్స్‌కు కావాల్సినంత వినోదం ఉండటంతో సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల మోత మోగించడం.. వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంటున్నారు.