800 వికెట్ల బరువైన భావోద్వేగం

క్రికెటర్ల బయోపిక్కులు తెరకు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని కథ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ ల మీద వచ్చిన సినిమాలు కొన్ని విజయం సాధించాయి, కొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇవన్నీ మన దేశం ఆటగాళ్లవే. కానీ మొదటిసారి శ్రీలంక క్రీడాకారుడి జీవితాన్ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం జరిగింది. అదే 800. శ్రీలంక సుప్రసిద్ధ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ స్క్రీన్ పై రానుంది. సచిన్ టెండూల్కర్ చేతుల మీద ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ముత్తయ్య(మధుర్ మిట్టల్) తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబం. కడు పేదరికంలో ఎన్నో అవమానాల మధ్య చాలీ చాలని తిండితో రోజులు గడుపుతూ ఉంటారు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మురళీధరన్ ఈ అవరోధాలు తట్టుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంటాడు. బాక్సింగ్ డే మ్యాచ్ లో బంతిని విసురుతున్నాడనే అభియోగం మీద క్రీడకు దూరం చేయడంతో అంతుచిక్కని వలయంలో చిక్కుకుంటాడు. పడిన చోటే లేవాలనే సూత్రం అనుసరించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపిస్తాడు. అదెలా జరిగిందో స్క్రీన్ మీద చూడాలి.

ఇలాంటివి బోలెడు చూసినప్పటికీ బరువైన డ్రామా ఈ 800లో కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీలంకలో ఎప్పుడూ చూడని చీకటి కోణాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎల్టిటిఈ చీఫ్ ప్రభాకరన్ తో ముత్తయ్య సంభాషించడం, బస్సులో ప్రయాణిస్తుండగా సాటి క్రికెటర్లతో పాటు బాంబు దాడికి గురవ్వడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు పొందుపరిచారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి క్రికెట్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళను టార్గెట్ చేసుకున్న 800 ఆ అంచనాలకు తగ్గట్టే కనిపిస్తోంది.

https://www.youtube.com/watch?v=iNp9cBWwcBE&t=2s