సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి సినిమా పెద్దన్న తెలుగులో ఐదు కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడు తెలుగులో వైభవం చూసిన రజినీ.. ఇంతగా మార్కెట్ దెబ్బ తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. మళ్లీ సూపర్ స్టార్ పుంజుకోవడం కష్టమే అని చాలామంది ఫిక్సయ్యారు కానీ.. జైలర్ మూవీతో ఆయన బలంగానే బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకోగా.. తొలి రోజు ఓ మోస్తరు టాక్‌తోనే అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. రజినీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అన్న టాక్ రావడంతో ఆమాత్రం చాలంటూ ఆయన ఫ్యాన్స్ తొలి రోజు మధ్యాహ్నం నుంచి జైలర్ కోసం ఎగబడ్డారు. మ్యాట్నీల నుంచే హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన జైలర్.. తర్వాత అస్సలు తగ్గట్లేదు. డిమాండ్ పెరిగి స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.
శుక్రవారం రిలీజైన చిరంజీవి సినిమా భోళా శంకర్‌కు నెగెటివ్ టాక్ రావడం జైలర్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సినిమాకు ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. తొలి రోజును మించి ఎక్కువ ఆక్యుపెన్సీలతో జైలర్ షోలు నడిచాయి. ఈవెనింగ్, నైట్ షోలకు అయితే ప్యాక్డ్ హౌస్‌లతో జైలర్ దూకుడు చూపించింది. భోళా శంకర్‌కు నెగెటివ్ టాక్ అంతకంతకూ పెరుగుతుండటంతో జైలర్ ఊహించని నంబర్స్ నమోదు చేసేలా ఉంది.
శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్లడం ఖాయం. చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ తెలుగులో పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడన్నది స్పష్టం. గత సినిమాల నెగెటివ్ ఎఫెక్ట్ వల్ల జైలర్ తెలుగు హక్కులు దిల్ రాజు, ఏషియన్ సునీల్‌లకు తక్కువ మొత్తానికే దొరికాయి. వాళ్లు ఈ సినిమాతో పంట పండించుకునేలా ఉన్నారు. తమిళ వెర్షన్ సైతం భారీ వసూళ్లతో సాగుతోంది.