డ్యామేజ్ చేస్తున్న టికెట్ రేట్ల వ్యవహారం

మహా అయితే ఇంకో పాతిక ముప్పై గంటల్లో భోళా శంకర్ ప్రీమియర్లు పడిపోతాయి. బుకింగ్స్ కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ మెల్లగా పుంజుకుంటాయనే  నమ్మకం యూనిట్ లో ఉంది. ఇదిలా ఉండగా ఫ్రైడే రిలీజ్ ఉంటే బుధవారం సాయంత్రం దాకా ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క తెలంగాణ థియేటర్ల అమ్మకాలు బుక్ మై షో, పేటిఎంలో జరుగుతున్నాయి. కానీ ఏపీ మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. చీటికీ మాటికీ చెక్ చేసుకుంటున్న ఫ్యాన్స్ అసహనం పీక్స్ కు చేరుకుంటోంది.

టికెట్ రేట్ల పెంపు కోసం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ పెట్టుకున్న అప్లికేషన్ కి ఇంకా సమ్మతి రాలేదని సమాచారం. సరైన డాక్యుమెంట్లు లేవని, కోరిన వివరాలు ఇవ్వలేదనే కారణంతో పెండింగ్ పెట్టినట్టు తెలిసింది. మొన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో చేసిన కామెంట్లు పెద్ద రాజకీయ రచ్చకే దారి తీశాయి. అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, పేర్ని నానితో సహా చాలా మంది మంత్రులు మెగాస్టార్ మీద మాటలతో ముప్పేట దాడి చేశారు. దెబ్బకు భోళా శంకర్ కు వెసులుబాటు ఎందుకివ్వాలని పలువురు మినిస్టర్లు కస్సుమనడంతో సమస్య పరిష్కారం లేట్ అవుతోంది.

పెద్ద హీరో అయినా చిన్నవాళ్ళైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాన్స్ సేల్స్ కీలకంగా మారుతున్నాయి. ఒకపక్క జైలర్ టికెట్లు తెలుగులోనూ వారం ముందే అందుబాటులోకి రాగా చిరంజీవి సినిమాకు మాత్రం ఇలా జరగడం విచిత్రం. ఏపీ రేట్లు మరీ తక్కువగా ఉండటం వల్ల పాతిక రూపాయల హైక్ అడగాల్సి వచ్చిందని అంతే తప్ప ప్యాన్ ఇండియా మూవీ అనో లేదా ఇంకేదో డబ్బులు చేసుకుందామనో కాదంటున్నారు యూనిట్ వర్గాలు. ఈలెక్కన చూస్తే ఇలాంటి పెంపులు కావాలంటే రెండు మూడు వారాల ముందే గవర్నమెంటుకు అప్లికేషన్ పెట్టుకోవడం సుఖం ఉత్తమం.