సోమవారం పరీక్షలో బ్రో పాసయ్యాడా

స్టార్ హీరోల కొత్త సినిమాల ఫలితాలకు మొదటి మూడు రోజులనే ప్రామాణికంగా తీసుకుంటే బోర్లా పడటం ఖాయమని ఇటీవలి బాక్సాఫీస్ పరిణామాలు ఋజువు చేస్తున్నాయి . ఆదిపురుష్ విషయంలో ఇలాంటి హడావిడినే చూశాం. రోజుకో వంద కోట్ల పోస్టర్ తో హోరెత్తించిన నిర్మాతలు సోమవారం నుంచి అసలు టాక్ బయటికి రావడంతో సైలెంట్ అయిపోయారు. జనం థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. నష్టాల శాతం కొంత మేర తగ్గినా ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ కాకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రో కూడా అచ్చం అదే దారిలో వెళ్తోంది.

శుక్రవారం నుంచి ఆదివారం దాకా 50 కోట్లకు పైగా షేర్ వచ్చిందని ప్రచారంతో హోరెత్తించిన బ్రోకు ఆడియన్స్ మండే షాక్ ఇచ్చారు. ఊహించిన దాని కన్నా చాలా తక్కువ వసూళ్లు నమోదై డిస్ట్రిబ్యూటర్లకు డేంజర్ బెల్ మ్రోగింది. నిన్న తిరిగి బేబీని ఊపందుకుందని, కొన్ని చోట్ల పవన్ కన్నా ఆనంద్ దేవరకొండనే ఎక్కువ రాబట్టాడని కొందరు సోషల్ మీడియాలో ఫిగర్లు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమే. హైదరాబాద్ లాంటి ఒకటి రెండు చోట్ల బ్రో పరిస్థితి బాగున్నంత మాత్రాన ఏపీ తెలంగాణ మొత్తం అలాగే ఉందనుకుంటే అచ్చంగా పప్పులో కాలేసినట్టే.

బ్రోకు నాలుగో రోజు మూడు కోట్లకు దగ్గరగా మాత్రమే షేర్ వచ్చిందట. ఇంచుమించు ఇదే టాక్, టికెట్ రేట్లతో గత ఏడాది భీమ్లా నాయక్ అయిదు కోట్ల షేర్ ని దాటడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.  దీంతో టీమ్ రంగంలోకి దిగి హీరో సాయి తేజ్ ని వెంటబెట్టుకుని సక్సెస్ టూర్ కి బయలుదేరింది. రిలీజయ్యాక ఒక పవన్ సినిమాకి ఇలాంటి పబ్లిసిటీ జరగడం గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ బ్రో విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇంకో 45 కోట్లకు పైగానే షేర్ రావడమంటే పెద్ద ఫీటని, అది సాధ్యమయ్యే సూచనలు తక్కువేనని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు.