ఫిబ్రవరిలో చడీచప్పుడు లేకుండా మొదలైన సినిమా ‘బ్రో’. .జులై నెలాఖరుకల్లా సినిమా థియేటర్లలోకి దిగేసింది. రీమేక్ మూవీ.. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని.. షెడ్యూళ్లు పకడ్బందీగా వేసుకుని చకచకా సినిమాను లాగించేశారు. దీని కోసం పవన్ సరిగ్గా మూడు వారాల డేట్లు కేటాయించాడంతే. ఈజీగా థియేట్రికల్ హక్కులతోనే వంద కోట్ల బిజినెస్ చేసేసిందీ సినిమా.
కానీ పవన్ మరో కొత్త సినిమా ‘ఓజీ’ సంగతి అలా కాదు. దీని బడ్జెట్ ఎక్కువ. రకరకాల లొకేషన్లలో తీయాల్సిన సినిమా. భారీ తారాగణం.. ఇలా ఈ సినిమా వ్యవహారమంతా వేరు. అయినా సరే.. ఈ సినిమా కూడా శరవేగంగా ముందుకు సాగుతూ వచ్చింది. వారాహి యాత్ర మొదలుపెట్టడానికి ముందు వరకు పవన్ ఈ సినిమా కోసం వరుసగా కొన్ని వారాల పాటు పని చేశాడు. సినిమా చిత్రీకరణ కూడా 60 శాతం అయిపోయింది.
పవన్ నిష్క్రమించాక కూడా వేరే నటీనటులతో ఒక షెడ్యూల్ షూట్ చేసింది చిత్ర బృందం. ఈ షెడ్యూల్ అయ్యాక టీం పవన్ కోసం వేచి చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో పవన్ ‘ఓజీ’ కోసం కొన్ని కాల్ షీట్లు ఇచ్చాడట. వరుసగా కాకపోయినా ఈ నెలలో వారం పది రోజుల పాటు పవన్ చిత్రీకరణకు హాజరవుతాడని సమాచారం.
ఈ షెడ్యూల్‌తో పవన్‌కు సంబంధించి మేజర్ టాకీ పార్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే పవన్‌కు వీలు చిక్కినపుడు కొన్ని రోజులు అందుబాటులోకి వస్తాడు. ఎన్నికల లోపు పవన్ వేరే సినిమా చిత్రీకరణకు మాత్రం వెళ్లడని తెలుస్తోంది. ‘ఓజీ’ని అనుకున్నట్లే డిసెంబర్లో రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు మేకర్స్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates