టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు మరోసారి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు సినిమా గుంటూరు కారం నుంచి అతణ్ని తప్పించారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. గత నెలలో ఒకసారి ఇలాగే జరిగితే.. తమన్ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాడు. చిత్ర బృందం కూడా అతణ్ని సినిమా నుంచి తప్పించినట్లేమీ ప్రకటించలేదు. రూమర్ల మీద మౌనం వహించింది.
గుంటూరు కారంలో తాను ఉన్నానని.. చక్కగా పాటలు చేసుకుంటున్నానని తమన్ క్లారిటీ ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు తమన్‌పై వేటు ఖాయం అంటూ మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో మలయాళ సంగీత దర్శకుడు, ఖుషీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హేషమ్ అబ్దుల్‌ను ఎంపిక చేశారని కూడా అంటున్నారు. ఐతే ఈ ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలోనే బ్రో ప్రమోషన్లలో భాగంగా తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో అతను గుంటూరు కారం గురించి ప్రస్తావన తెచ్చాడు. తాను ఈ సినిమాలో పక్కాగా ఉన్నానని కన్ఫమ్ చేశాడు. తాను ఈ సినిమాలో లేకపోతే చిత్ర బృందం ఆ విషయాన్ని ప్రకటించేది కదా అని అతను ప్రశ్నించాడు. రాసేవాళ్లు, ప్రచారం చేసేవాళ్లు ఏమైనా చేసుకోనీ.. తాను మాత్రం తన పని చేసుకుపోతున్నానని అతను స్పష్టం చేశాడు. గుంటూరు కారం పాటల పని జరుగుతున్నట్లు అతను క్లారిటీ ఇచ్చాడు. తాను పనితోనే అందరికీ సమాధానం చెబుతానని కూడా తమన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐతే ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి తమన్‌కు కూడా క్లారిటీ ఉండకపోవచ్చని.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అతడిపై వేటు పడి ఉండొచ్చేమో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates