పొలిటికల్ ఎంట్రీకి ముందు శంకర్‌తో?

తమిళనాట ఇప్పుడు స్టార్ హీరో విజయ్ పేరు మార్మోగుతోంది. అలా అని తన కొత్త సినిమాకు సంబంధించి ఏమీ ఇప్పుడు అప్‌‌డేట్ రాలేదు. విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటమే తన గురించి చర్చ జరుగుతుండటానికి కారణం. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. రెండేళ్ల ముందే విజయ్ పార్టీ పెడతాడనే ప్రచారం జరుగుతోంది.

ఆ లోపు విజయ్ ఒకట్రెండు పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘లియో’ దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఆ తర్వాత వెంకట్ ప్రభుతో విజయ్ సినిమా చేస్తాడని అంటున్నారు. అది కాస్త పొలిటికల్ టచ్ ఉన్న సినిమానే కావచ్చని సమాచారం. ఐతే దీన్ని మించి రాజకీయంగానూ ప్రకంపనలు రేపే సినిమా ఒకటి చేయబోతున్నాడట విజయ్.

సామాజిక, రాజకీయ అంశాలతో ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో విజయ్ సినిమా చేయబోతున్నాడట. వీరి కలయికలో ఇంతకుముందు ‘స్నేహితుడు’ సినిమా వచ్చింది. అది ‘3 ఇడియట్స్’కు రీమేక్. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్-2’తో పాటు ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు.

ఇవి రెండూ పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలే. ఇక విజయ్ రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడేలా.. సామాజిక, రాజకీయ అంశాలతో ముడిపడ్డ స్క్రిప్టును శంకర్ సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే మొదలవుతుందని.. విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమా రిలీజవుతుందని అంటున్నారు. ప్రస్తుతం శంకర్, విజయ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట.