చాలా గ్యాప్ తర్వాత ఫన్ అండ్ యాక్షన్ జోన్ లోకి వచ్చిన నాగశౌర్య జూలై 7న రంగబలితో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గత కొనేళ్లుగా ఎన్ని విభిన్న ప్రయోగాలు చేస్తున్నా తన స్థాయికి తగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ కుర్ర హీరోకి దీని సక్సెస్ చాలా కీలకం. ఆ మధ్య వదలిన టీజర్ కి మంచి స్పందనే వచ్చింది. రిలీజ్ రోజు మీడియం రేంజ్ సినిమాలతో పోటీ గట్టిగానే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందాక అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. మూవీ కాన్సెప్ట్ ఏంటో వీడియోలో చెప్పేశారు.
స్వంత ఊరంటే విపరీతమైన అభిమానం ఉండే ఒక యువకుడు(నాగ శౌర్య) ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. డబ్బులు కావాలన్నా స్వంత తండ్రి(గోపరాజు రమణ) షాపులో దొంగతనం చేసేంత ఘటికుడన్న మాట. ఓ మెడికో స్టూడెంట్(యుక్తి తరేజా) ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడే క్రమంలో రంగబలి సెంటర్ గురించి తెలుస్తుంది. ఆ ప్రాంతంతో పాటు అందరినీ చెప్పు చేతల్లో పెట్టుకున్న ఓ రౌడీ నాయకుడి(షైన్ టామ్ చాకో) దోస్తీతో పాటు శత్రుత్వమూ వస్తుంది. ఇంతకీ రంగబలి వెనుక ఉన్న అసలు కథేంటో ఇంకో వారం ఆగితే తెలుస్తుంది
కంటెంట్ అయితే క్లాసు మాస్ అందరినీ టార్గెట్ చేసినట్టు ఉంది. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా టచ్ చేశారు. ప్రత్యేక పాత్ర వేసిన శరత్ కుమార్ ని కేవలం ఒక ఫ్రేమ్ లోనే చూపించి కట్ చేయడం, పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ హింట్ ఇవ్వడం బాగున్నాయి. కమెడియన్ సత్య టైమింగ్ తో నాగ శౌర్య పండించిన కామెడీ పేలేలా ఉంది. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన రంగబలిలో అన్ని అంశాలైతే పొందుపరిచారు. పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో ఛలోని మించిన కమర్షియల్ కంటెంట్ అయితే కనిపిస్తోంది. అంచనాలు అందుకుంటే హిట్టే