మహేష్ ఫ్యాన్సా మజాకా

అన్ని వర్గాల్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు. అతణ్ని పిల్లలు అభిమానిస్తారు. పెద్దలూ ఇష్టపడతారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణా కావాల్సినంత ఉంది. లేడీ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. మాస్ ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. యూత్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ అభిమానాన్ని చాటుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.

ఓ పల్లెటూరికి చెందిన పది మంది పిల్లలు.. తమదైన శైలిలో మహేష్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’లో హైలైట్‌గా నిలిచిన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడిని సైతం ఆశ్చర్యపరిచిందా వీడియో. మొబైల్ కెమెరాతో పల్లెటూరి వాతావరణంలో ‘సరిలేరు..’ ఇంటర్వెల్ సీన్‌ను రీక్రియేట్ చేసిన వైనం చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. ఈ సన్నివేశంలో పాల్గొన్న వాళ్లందరూ పది పన్నెండేళ్ల వయసు లోపు వారే. ఒక పిల్లాడు మహేష్ బాబుగా మారితే.. ఇంకొకడు అజయ్ అయ్యాడు. ఒక అబ్బాయి విజయశాంతి పాత్ర వేశాడు. మిగతా వాళ్లు వేరే పాత్రల్ని పంచుకున్నారు.

అంతా కలిసి ఐదు నిమిషాల నిడివితో ఈ వీడియో తయారు చేశారు. బ్యాగ్రౌండ్లో సినిమాలోని డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ నడుస్తుంటే.. వీళ్లు అందుకు తగ్గట్లు అభినయించారు. స్లో మోషన్ ఫైట్లు.. ఇసుక ఎగిరిపడే ఎఫెక్ట్స్ ఈ వీడియోలో హైలైట్. ఎవరైనా పెద్దవాళ్లే వీళ్లతో ఈ వీడియో చేయించి ఉండొచ్చేమో కానీ.. తెరమీద మాత్రం అందరూ పిల్లలే కావడంతో ఈ వీడియో అబ్బురపరుస్తోంది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్స్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.