పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో బిజీయెస్ట్ హీరో. ఆయన నటిస్తున్న నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయిప్పుడు. కెరీర్లో ఎన్నడూ పవన్ ఇలా ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనడం ఎవ్వరూ చూడలేదు. అది కూడా రాజకీయాల్లోనూ బిజీగా మారిన సమయంలో సినిమాల కోసం ఇంత కష్టపడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆల్రెడీ ‘బ్రో’ సినిమాకు సంబంధించి తన వర్క్ మొత్తం ఎప్పుడో పూర్తి చేశాడు పవర్ స్టార్.
ఆ సినిమా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత రిలీజయ్యే పవన్ సినిమా ఏదనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎప్పట్నుంచో చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తున్న ‘హరిహర వీరమల్లు’ను పవన్ ఇప్పట్లో పూర్తి చేస్తాడనే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. అసలు ఆ సినిమా షూట్ స్టేటస్ ఏంటనే విషయంలో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఏడాదైతే ‘హరిహర వీరమల్లు’ రిలీజయ్యే సంకేతాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఇక లేటుగా మొదలైనప్పటికీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ షూటింగ్ పరంగా ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. ఐతే మొదట్లో ‘ఉస్తాద్..’ టీమే ఊపులో కనిపించింది. చకచకా రెండు షెడ్యూళ్లు పూర్తి చేసి టీజర్ కూడా రిలీజ్ చేయగలిగింది. కానీ ఆ తర్వాత పవన్ ‘ఓజీ’కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. చకచకా ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది.
తర్వాతి డేట్లు ‘ఉస్తాద్..’కే అని అందరూ అనుకుంటుంటే.. పవన్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఓజీ’కి కొత్తగా మళ్లీ డేట్లు కేటాయించాడు. ఒకవైపు ఒక భారీ సెట్ రెడీ చేసుకుంటూ పవన్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ‘ఉస్తాద్..’ టీంకు నిరాశ తప్పలేదు. ‘ఓజీ’కి పవన్ ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే.. ‘బ్రో’ తర్వాత అదే రిలీజవుతుందేమో.. ఈ ఏడాదే ఆ సినిమా కూడా ప్రేక్షకులను పలకరిస్తుందేమో అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates