దివంగత నటుడు శరత్ బాబుతో లెజెండరీ నటి రమాప్రభ ఒకప్పుడు భార్య భర్తలన్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం కొనసాగింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐతే శరత్ బాబును హీరోగా నిలబెట్టడానికి కొన్ని సినిమాలు నిర్మించడమే కాక.. తన మీద ప్రేమతో ఆస్తులన్నింటినీ కూడా ఆయనకు ధారాదత్తం చేసినట్లు రమాప్రభ తరచుగా ఆవేదన చేస్తుంటారు. కానీ శరత్ బాబు ఆ ఆరోపణలను ఖండిస్తూ రమాప్రభనే తనను మోసం చేసినట్లు చెప్పేవారు.
కాగా ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా చెన్నైలో ఉన్న ఓ ఇంటి గురించి మీడియాలో వస్తున్న వార్తల మీద రమాప్రభ అసహనం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తన సొంతం అని.. అది శరత్ బాబుది కాదు అని ఆమె ఆయన పేరెత్తకుండా వ్యాఖ్యానించారు. తాను నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్లో ఆమె ఈ విషయం వెల్లడించారు.
చెన్నైలో తనకో ఇల్లు ఉందని.. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారని.. కానీ అది రమాప్రభ ఇల్లు అనే విషయం ఎవరూ చెప్పడం లేదని రమాప్రభ ఆవేదన వ్యక్తం చేశారు. అది తన ఇల్లు కాదు.. వేరే వాళ్ల ఇల్లు అని మీడియాలో చెబుతుండటం.. అది విని తనకు నవ్వొస్తోందని రమాప్రభ అన్నారు.
తనకు రజినీకాంత్ డబ్బులు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు చూశానని.. కానీ తాను 13 ఏళ్ల చిన్న వయసు నుంచే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టానని.. కానీ ఇప్పుడు తన గురించి చాలామంది ఏది పడితే అది మాట్లాడుతూ సంపాదిస్తున్నారని రమాప్రభ ఆవేదన చెందారు. శరత్ బాబు మరణం, ఈ నేపథ్యంలో మాజీ భార్యగా తన గురించి వస్తున్న వార్తలపై రమాప్రభ స్పందిస్తూ.. “కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఒక్కోసారి బాధ కలుగుతుంది. ఏదో రకంగా నేను పాపులర్ అవుతున్నా” అని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates