కరోనా వల్ల పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఇబ్బంది పడ్డ వాళ్లే. టాలీవుడ్ బిగ్ షాట్స్‌లో ఒకరైన దిల్ రాజు కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన ఫస్ట్ కాపీ తీసి రెడీగా ఉంచుకునున ‘వి’ చిత్రం.. ఇక విడుదలే తరువాయి అనుకున్న తరుణంలో లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఓటీటీ రిలీజ్ కోసం మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్లోనే రిలీజ్ చేయాలని ఆయన ఎదురు చూస్తున్నారు.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ‘వి’ మాత్రమే కాదు.. రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ సైతం ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా అన్ని ప్రణాళికలనూ దెబ్బ తీసింది. ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ ఇంకా మిగిలి ఉండటంతో దాని విడుదల గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితి లేదు. ‘వి’ సంగతే తేల్చాల్సి ఉంది.
అందరు నిర్మాతల్లాగే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి.. మళ్లీ జనం ఎప్పుడు హాళ్లలో సినిమాలు చూసేందుకు వస్తారు అని ఎదురు చూసి చూసి అలసిపోతున్నాడు రాజు. ఆగస్టుకల్లా పరిస్థితులు బాగుపడతాయి. సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని ముందు అనుకున్నాడు. తర్వాత దసరాపై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అప్పటికి కూడా థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయన్న ఆశ లేదు.
ఐతే అక్టోబరు నవంబరు నెలలకు కరోనా వ్యాక్సిన్ రావడమో.. లేక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి కరోనా భయం తొలగిపోవడమో జరిగి థియేటర్లు తెరుస్తారని.. కొన్ని వారాలు చిన్నా చితకా సినిమాలతో ట్రయల్ రన్ నడిపించాక.. క్రిస్మస్‌కు ‘వి’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసుకోవచ్చని రాజు ఆశిస్తున్నట్లు సమాచారం. అదీ కాదంటే సంక్రాంతి గురించి ఆలోచిస్తాడేమో. ప్రస్తుతానికైతే ‘వి’ క్రిస్మస్‌కు విడుదల కావచ్చన్నది అంచనా.