నరేష్ పెళ్లికి భలే కలిసొస్తున్నాయి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు మే నెల పీడకలగా మారింది. ఒక్కటంటే ఒక్కటి సూపర్ హిట్ అనిపించుకునే స్థాయిలో ఆడకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది. రామబాణం అవుట్ రైట్ గా తిరస్కరించబడగా ఉగ్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా లాభం లేకపోయింది. ఇక కస్టడీ సంగతి సరేసరి. చైతు సైతం తమ్ముడు ఏజెంట్ నే ఫాలో కావాల్సి వచ్చింది. నిన్న విడుదలైన అన్నీ మంచి శకునములేని ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తినబెట్టుకుని ఆదరిస్తారనుకుంటే అది నెరవేరేలా లేదు.

టాక్ మరీ డివైడ్ గా ఉండటంతో బుకింగ్స్ లో పికప్ కనిపించడం లేదు. వీకెండ్ మీద భారమంతా. ఈ పరిణామాలన్నీ నరేష్ మళ్ళీ పెళ్ళికి కలిసొస్తున్నాయి. మే 26న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు పోటీగా మేం ఫేమస్ ఉంది. ప్రమోషన్ పరంగా యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న ఈ ఎంటర్ టైనర్ ని ఛాయ్ బిస్కెట్ టీమ్ ప్రమోట్ చేస్తున్న విధానం భారీగా కాదు కానీ మంచి ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది.

అయితే మాస్ కి కనెక్ట్ అవ్వడం గురించి ఇప్పుడే చెప్పలేం. మలయాళం డబ్బింగ్ 2018 కేరళలో ఎంత వసూళ్ల సునామి సృష్టించినా ఆ వరద ట్రాజెడీ డ్రామా మనవాళ్లకు కనెక్ట్ అవ్వడం అనుమానమే. నిర్మాతలు మాత్రం కాంతార లాగా సర్ప్రైజ్ హిట్ అనే నమ్మకంతో ఉన్నారు. సో మళ్ళీ పెళ్లికి ఇవన్నీ సానుకూల అంశాలే. ఈ వారం నుంచి నరేష్, పవిత్ర లోకేష్ పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు.

ఒక ఆరేడు రోజులు నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు ఈవెంట్లు ప్లాన్ చేసుకున్నారు. వాటి ద్వారా కొన్ని సంచలనాత్మకమైన విషయాలు బయట పెట్టి తద్వారా హైప్ ని పెంచే ప్లానింగ్ జోరుగా ఉందట. పైకి కొత్త కథని చెబుతున్నారు కానీ ట్రైలర్ చూశాక ఇది నరేష్ నాలుగో పెళ్లి బయోపిక్ అని చిన్నపిల్లాడు సైతం చెప్పేశాడు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మళ్ళీ పెళ్లి బిజినెస్ షాక్ ఇచ్చేలా ఉందని బయ్యర్ల నుంచి వస్తున్న ఇన్ సైడ్ టాక్.