సమంత లైన్ లో మరో యంగ్ హీరో

ఒక‌ప్పుడు స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన స‌మంత‌.. ఆ త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వ‌చ్చింది. యుట‌ర్న్, ఓ బేబీ, య‌శోద లాంటి చిత్రాలు ఆమెకు మంచి ఫ‌లితాన్నే అందించాయి. కానీ శాకుంత‌లం మాత్రం చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. ఈ దెబ్బ‌తో ఇక స‌మంత‌ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మానేస్తే బెట‌ర్ అన్న అభిప్రాయాలు వినిపించాయి. స‌మంత ఆలోచ‌న కూడా ఇలాగే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి లాంటి ఫ‌క్తు ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్న సామ్.. దీని త‌ర్వాత మ‌రో యంగ్ హీరోతో జ‌ట్టు క‌ట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కావ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే. వీరి క‌ల‌యిక‌లో నందిని రెడ్డి ఒక సినిమా తీయ‌బోతోంద‌న్న‌ది తాజా క‌బురు. ఈ గురువారం అన్నీ మంచి శ‌కున‌ములే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతోంది నందిని.

ఇది క‌చ్చితంగా హిట్ట‌య్యే సినిమా అని ఇండ‌స్ట్రీ జ‌నాలు న‌మ్ముతున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన త‌ర్వాత ఆమె సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు ఒక క‌థ చెప్పి ఒప్పించింది. త‌మ క‌ల‌యిక‌లో ఒక మ్యాడ్ రోల‌ర్ కాస్ట‌ర్ లాగా.. క్రేజీగా ఈ సినిమా ఉంటుంద‌ని నందిని ఇంత‌కుముందే చెప్పింది. ఐతే ఈ సినిమాలో స‌మంత హీరోయిన్ అనే విష‌యం ఆమె వెల్ల‌డించ‌లేదు.

స‌మంత‌తో నందినిక వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహం ఉంది. వీరి కల‌యిక‌లో జ‌బ‌ర్ద‌స్త్, ఓ బేబీ సినిమాలు వ‌చ్చాయి. వ‌య‌సు అంత‌రం ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య జ‌రిగే క‌థ‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సిద్ధు, స‌మంత‌లైతే బాగుంటార‌ని నందిని భావిస్తోంద‌ట‌. డీజే టిల్లుతో మాంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్ధుతో స‌మంత జ‌త క‌డితే.. నందిని ఆ సినిమాను రూపొందిస్తే ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ రావ‌డం ఖాయం.