బ్లాక్ బస్టర్ అయిన సినిమాలే కాదు.. డిజాస్టర్ అయిన సినిమాలు కూడా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతుంటాయి. ట్రోలింగ్ ద్వారా వాటిని బాగా వార్తల్లో నిలబెడుతుంటారు నెటిజన్లు. థియేటర్లలో వాషౌట్ అయిపోయిన అలాంట ిచిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేటపుడు కొంచెం హంగామా కనిపిస్తుంది.
థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ వస్తే వచ్చిందని.. డిజిటల్ రిలీజ్ టైంలో ఓటీటీలు కూడా వాటిని ప్రమోట్ చేసి జనాల దృష్టిని ఆకర్షించాలని చూస్తాయి. కానీ ‘శాకుంతలం’ సినిమా విషయంలో ఇలా ఏమీ జరగలేదు. ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. అందులో గ్రాఫిక్స్ సహా అనేక విషయాలపై నెటిజన్లు టీంను ఒక ఆటాడుకున్నారు. ఇప్పుడా సినిమా చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
సరిగ్గా రిలీజైన నాలుగు వారాలకు ‘శాకుంతలం’ను అమేజాన్ ప్రైమ్ వాళ్లు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమ్ అవుతో్ంది. మామూలుగా ప్రైమ్ వాళ్లు కొత్త సినిమాలు రిలీజవుతున్నపుడు కొంచెం హడావుడి చేస్తారు. థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ఓటీటీ రిలీజ్ గురించి అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తారు.
కానీ ‘శాకుంతలం’ విషయంలో అలా చేయలేదు. నెటిజన్లకు కొంచెం లేటుగా ఈ విషయం తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం ఓటీటీలో వస్తే చూడాలని చాలామందే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిక సినిమా చూసి ఇంకో రౌండ్ ట్రోలింగ్ మొదలుపెట్టడం ఖాయం. బిగ్ స్క్రీన్ మీద త్రీడీలో చూసినపుడే ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. ఇక చిన్న తెర మీద 2డీలో చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చెప్పాల్సిన పని లేదు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.