కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు తమ సన్నిహితుల కోసం వాళ్ల సినిమాల్లో క్యామియోలు చేయడం, లేదంటే ప్రమోషన్ల పరంగా సాయం చేయడం సినీ రంగంలో మామూలే. ఇలాంటి వాటిలో ఫినాన్షియల్ కోణం ఏమీ ఉండదు. ఉచితంగానే ఇలాంటి సాయాలు చేస్తుంటారు. కమెడియన్ సునీల్ హీరోగా మారి వరుసగా సినిమాలు చేసిన టైంలో రవితేజ ఇలాగే చిన్నపాటి సాయం చేశాడు.
మర్యాదరామన్న సినిమాలో ఒక పాత్ర లాగా ప్రత్యేకంగా కనిపించిన సైకిల్‌కు వాయిస్ ఇచ్చాడు. మాస్ రాజా తనదైన శైలిలో చెప్పిన డబ్బింగ్ ఆ సైకిల్ క్యారెక్టర్‌కి భలే సెట్టయింది. ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది. అప్పుడు రాజమౌళి అడిగితేనే రవితేజ ఈ సాయం చేసి ఉండొచ్చు కానీ.. సునీల్‌కు అది బాగా ఉపయోగపడింది. అప్పటి ఆ సాయానికి ఇప్పుడు అతను రుణం తీర్చుకున్నాడు.
రవితేజ నిర్మాతగా ఇప్పుడు ఛాంగురే బంగారు రాజా అనే చిన్న సినిమా ఒకటి తెరకెక్కింది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఇందులో లీడ్ రోల్ చేశాడు. సత్య, రవిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. సతీష్ వర్మ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ సినమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. అది ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
కాన్సెప్ట్ బేస్డ్ మూవీలాగా కనిపిస్తున్న ఈ చిత్రం.. ట్రైలర్‌తో బాగానే ఇంప్రెస్ చేసింది. ఇందులో ఒక కుక్క పాత్ర కీలకం కావడం విశేషం. ఈ సినిమాకు నరేటర్‌గా వ్యవహరించేది ఈ కుక్క పాత్రే. దాని పేరు.. వీర బొబ్బిలి. ఈ పాత్రకు వాయిస్ ఇచ్చింది సునీలే. ఒకప్పటి కామెడీ టచ్‌ను గుర్తుకు చేస్తూ భలే ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు సునీల్. సినిమాలో కథను మలుపు తిప్పేది కూడా ఈ కుక్క పాత్రే కావడం గమనార్హం. రవితేజ అప్పుడు తన సినిమాలో సైకిల్ పాత్రకు వాయిస్ ఇస్తే.. ఇప్పుడు రవితేజ ప్రొడ్యూస్ చేసిన సినిమాలో కుక్క పాత్రకు గొంతు అరువిచ్చి రుణం తీర్చేసుకున్నాడన్నమాట సునీల్.