స్టార్ హీరోలు సినిమాల ఎంపికలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాటి తాలూకు ప్రభావాలు అభిమానుల మీద పడతాయి. అది ఫుల్ లెన్త్ అయినా క్యామియో అయినా సరే ఉపయోగపడే అవకాశం లేనప్పుడు వదిలేసుకోవడమే మంచిది. ఉదాహరణకు హాండ్స్ అప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, కృష్ణార్జునలో నాగార్జున ఇలా వీటి వల్ల ఆయా నిర్మాతలకు బిజినెస్ వల్ల ప్రయోజనం కలిగింది కానీ రిజల్ట్ వల్ల డ్యామేజ్ జరిగింది హీరోలకే. తర్వాత మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చెసే సాహసం చేయలేదు కానీ ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం విక్టరీ వెంకటేష్.
ఇటీవలే రిలీజైన కిసీకా భాయ్ కిసీకా జాన్ లో చేసిన పూజా హెగ్డే అన్నయ్య పాత్ర ఎలాంటి పేరుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందు రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ఎంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఓరి దేవుడాలో చేసిన చిన్న క్యారెక్టర్ ఆ సినిమా స్కేల్ ని పెంచలేకపోయింది. తక్కువ గ్యాప్ లో మూడూ ఫ్యాన్స్ ని సైతం సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే సైంధవ్ విషయంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి రెగ్యులర్ మాస్ మసాలాలు లేకుండా దర్శకుడు శైలేష్ కొలను దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఫ్యామిలి ఇమేజ్ ఉన్న వెంకటేష్ డెబ్భై అయిదు సినిమాల తర్వాత ప్రయోగాలకు మొగ్గు చూపడం మంచిదే అయినా స్నేహం కోసమో లేక ఇంకో కారణం కోసమో తనకు నప్పని కంటెంట్ లో నటించడం వల్ల నష్టమే ఎక్కువగా జరుగుతోంది. అసలు సల్మాన్ ఖాన్ కే భాయ్ జాన్ వల్ల ప్రయోజనం కలగనప్పుడు వెంకీకి ఒరిగేది ఏముంటుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. రానా నాయుడు 2లో అయినా కాస్త బూతులు బోల్డ్ కంటెంట్ తగ్గిస్తే బాగుంటుంది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. 2024 జనవరిలో స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని టాక్.