బాక్సాఫీస్ సమ్మర్ చాలా చప్పగా సాగుతోంది. సినిమాలైతే వస్తున్నాయి కానీ కనీసం యావరేజ్ అనిపించుకునేలా ఏవీ లేకపోవడంతో గ్యాప్ పెరిగిపోతోంది. గత నెల చివర్లో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ తర్వాత కనీసం దాంట్లో సగమైనా అందుకునే సూపర్ హిట్ మూవీ ఏదీ రాలేదు. ఏప్రిల్ మొదటి వారం ఒకే రోజు పలకరించిన రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్ రెండూ బోల్తా కొట్టేశాయి. బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పలేదు. తాజాగా వచ్చిన శాకుంతలం సిచువేషన్ అంతంతమాత్రంగా ఉంది. పబ్లిక్ టాక్, రివ్యూలు అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. అద్భుతాలు జరిగే ఛాన్స్ లేనట్టే.
వచ్చే వారం 21న రిలీజయ్యే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మీద ఇప్పుడు అందరి చూపు వెళ్తోంది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ విలేజ్ ఫాంటసీ థ్రిల్లర్ తో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాలీవుడ్ లక్కీ గర్ల్ గా మారిన సంయుక్త మీనన్ హీరోయిన్. కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు ట్రైలర్ చూశాక అర్థమైపోయింది. థియేటర్లలో జనం నిండుగా కనపడని పరిస్థితులను తేజు కనక సరిగ్గా వాడుకుంటే బ్లాక్ బస్టర్ పడిపోతుంది. గ్రామాల్లో ఉండే మూఢనమ్మకాలు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయనే విభిన్నమైన పాయింట్ తో దీన్ని రూపొందించారు.
అదే రోజు సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ ఉంది కానీ దాన్ని టార్గెట్ ఆడియన్స్ వేరు. ఎంత వెంకటేష్ పూజా హెగ్డేలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆశించిన స్థాయిలో బజ్ లేదు. సో తెలుగు మార్కెట్ వరకు విరూపాక్ష ఫస్ట్ ఆప్షన్ గా మిగిలిపోతుంది. రిపబ్లిక్ తర్వాత బాగా టైం తీసుకుని వస్తున్న సాయి ధరమ్ తేజ్ కి ఇది హిట్ కావడం చాలా కీలకం. జూన్ లో వచ్చే వినోదయ సితం రీమేక్ లో మావయ్య పవన్ హైలైట్ అవుతాడు కాబట్టి సోలో హీరోగా ఇప్పుడీ విరూపాక్షతో కనక ప్యాన్ ఇండియా లెవెల్ లో గట్టి కొట్టి కొడితే కాస్త పెద్ద ప్రోజెక్టులను పట్టొచ్చు. ఇంకో ఆరు రోజుల్లో తేలిపోతుంది.