ప్రశాంత్ నీల్.. పౌరాణికం.. సెట్టవుతుందా?


కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది మనసులు దోచి.. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఇది రెండు భాగాలుగా విడుదలైనప్పటికీ.. కథగా చూసుకుంటే ఒక్కటే. దీని కంటే ముందు కన్నడలో ‘ఉగ్రం’ అనే సినిమాతో హిట్ కొట్టాడు కానీ.. కర్ణాటకను దాటి ఎక్కడా దాని గురించి తెలియదు. ఐతే ‘కేజీఎఫ్’ సినిమాలో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలను అతను ప్రెజెంట్ చేసిన విధానం.. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయం చూసి తనతో పని చేయడానికి ఇండియాలోని టాప్ స్టార్లు పోటీ పడ్డారు. వారిలో ముందుగా ప్రభాస్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమాలు ఓకే చేశాడు ప్రశాంత్.

‘కేజీఎఫ్’ను చూసి ప్రశాంత్ మీద ఒక అంచనాకు రాలేమని.. ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ రిలీజైతే కానీ ప్రశాంత్ అసలు సత్తా ఏంటో తెలియదని అంటున్న వారూ లేకపోలేదు. కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రశాంత్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.

ప్రశాంత్ ఎప్పుడు ఖాళీ అవుతాడో తెలియకున్నా అతడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక సినిమాకు కమిట్మెంట్ తీసేసుకున్నాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలోనూ ప్రభాసే హీరో కావడం విశేషం. తాజాగా ‘శాకుంతలం’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసి దిల్ రాజు.. ప్రశాంత్-ప్రభాస్ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. ఎన్టీఆర్ సినిమా అయ్యాక ప్రశాంత్ చేసే చిత్రం ఇదే అని.. ఈ సినిమాకు కథ కూడా రెడీ అయిందని రాజు వెల్లడించడం విశేషం. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ప్రభాస్‌తో ప్రశాంత్ తీయబోయేది పౌరాణిక చిత్రం అని రాజు వెల్లడించడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

‘బాహుబలి’లో రాజు పాత్రలో అదరగొట్టిన ప్రభాస్‌ను పౌరాణిక చిత్రంలో చూడటంలో ఏ ఇబ్బందీ లేదు. కానీ ఉగ్రం, కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ప్రశాంత్ శైలి మీద ఒక అంచనాకు వచ్చేశారు ప్రేక్షకులు. అతడి సినిమాలన్నీ ఒక తరహాలో కనిపిస్తున్నాయి. ఇలాంటి దర్శకుడు పౌరాణిక చిత్రాన్ని డీల్ చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అతను ఇప్పుడు తీస్తున్న సినిమాలను బట్టి చూస్తే మాత్రం పౌరాణికం సూటవుతుందని అస్సలు అనిపించడం లేదు. ఈ తరంలో రాజమౌళి మినహా ఎవరూ అలాంటి సినిమా తీయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. మరి రాజు చేయబోతున్న రిస్క్ ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.