ఒకప్పుడు స్టార్ హీరోలు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే మీడియాతో చెబితే అది పత్రికల ద్వారా లేదా టీవీ ఛానల్స్ ద్వారా అభిమానులకు చేరేది. కానీ ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా వచ్చాక నేరుగా ఫ్యాన్స్ తో మాట్లాడకపోయినా అక్షరాల రూపంలో పంచుకుంటున్నది జనంతో చెప్పినట్టుగానే తీసుకోవాలి. అందులోనూ మిలియన్ల ఫాలోయర్లున్న హీరోలు వీటి విషయంలో అందుకే జాగ్రత్తగా ఉంటారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 20 ఏళ్ళ నట ప్రస్థానం పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. పరిశ్రమతో పాటు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు తప్పించి ప్రత్యేకంగా ఎవరి ప్రస్తావన లేదు. ఇక్కడే మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. గంగోత్రి విడుదల టైంలో కేవలం చిరంజీవి మేనల్లుడిగానే థియేటర్ కు వెళ్ళాం తప్పించి అల్లు రామలింగయ్యగారి మనవడనో లేదా అరవింద్ అబ్బాయనో కాదని అంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు.
బన్నీ స్వయంగా మెగాస్టార్ వేసిన రోడ్డు మీద మేమంతా నడుచుకుంటూ వచ్చామని గతంలో పబ్లిక్ స్టేజి మీదే అన్నాడు. ఇప్పుడు కనీసం ఆయన పేరుని చెప్పలేదన్నది ఒక వెర్షన్. అయితే అసలు తాత తండ్రులకే థాంక్స్ చెప్పకుండా మాములుగా ట్వీట్ చేసినప్పుడు స్పెషల్ గా మామయ్య గురించి మాత్రం ఎందుకు చెప్పాలనేది బన్నీ తరఫున ఫ్యాన్స్ డిఫెన్స్
ఇంకో సైడ్ నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ నుంచి ఎలాంటి ట్వీట్ లేదు. ఫోన్లో చెప్పుకున్నారేమో బయట తెలియదు కాబట్టి జనాలు ట్విట్టర్ లేదా ఇన్స్ టా వైపే చూస్తారు. కానీ అక్కడేమీ లేదు. నిన్న పార్టీలోనూ కనిపించలేదు. ఒకవేళ పుష్ప 2తో బిజీ అనుకుంటే సుకుమార్ కూడా రాకూడదు. మొత్తానికి బన్నీ మనసులో ఏముందో కానీ తన చర్యలు మాత్రం నానార్థాల రూపంలో బయటికి వెళ్తున్నాయి. ఒక్కోసారి చిన్న ట్వీట్లు సైతం పెద్ద రగడకు దారి తీస్తాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఓపెన్ గానే తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.