రంగమార్తాండ లాభనష్టాల లెక్కలు

చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ సినిమా బాగుందని చూడొచ్చనే మాట వినిపించింది రంగమార్తాండ విషయంలోనే. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని టీమ్ చేసిన విస్తృత ప్రమోషన్లు ఓపెనింగ్స్ విషయంలో బాగానే పనికొచ్చాయి. అయితే థియేటర్ల దగ్గర జనాల సందడి మరీ ఎక్కువ లేకపోవడం కొంత ఆందోళన కలిగించినా స్టార్ క్యాస్టింగ్ లేని ఇలాంటి ఎమోషనల్ డ్రామాకు కుటుంబాలు ఈ మాత్రం కదిలి రావడం పాజిటివ్ కోణంలోనే చూడాలి. ఆదివారం రాత్రి వరకు ఈ చిత్రానికి రన్ అయ్యే షోలు చాలా కీలకంగా మారనున్నాయి. వీలైనంత రాబట్టుకుని గట్టెక్కాలి.

ఇక లెక్కల సంగతికొస్తే రంగమార్తాండను సుమారు రెండున్నర కోట్ల దాక బిజినెస్ చేశారట. మూడు రోజులకు గాను కోటి పది లక్షల దాకా షేర్ వచ్చింది. ఇంకో కోటి యాభై లక్షలు పెద్ద మొత్తం కాకపోయినా ఆక్యుపెన్సీలు పెరగాల్సిన అవసరం చాలా ఉంది. కాసేపు ఇది పక్కన పెడితే ప్రొడక్షన్ వరకు ఎనిమిది కోట్లకు పైగానే ఖర్చయ్యిందట. ఓటిటి హక్కులకు అమెజాన్ ప్రైమ్ ఆరు కోట్ల దాకా చెల్లించిందని ఇన్ సైడ్ టాక్. మైత్రి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నందుకుగాను మరో రెండు కోట్లు ముట్టాయి. సో పెట్టుబడి కోణంలో చూస్తే నష్టమేమీ రాలేదు. థియేటర్ రెవిన్యూ లాభనష్టాలు తేలాల్సి ఉంది.

మొత్తానికి చిన్న సినిమా ఈ మాత్రం స్పందన తెచ్చుకోవడం అనూహ్యమే. విపరీతమైన బడ్జెట్ పరిమితులతో పాటు మూడేళ్ళ పాటు జరిగిన నిర్మాణం రంగమార్తాండ మీద ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోయింది. ఒకదశలో ఆగిపోయినంత పని చేసినప్పటికీ కృష్ణవంశీ గట్టి పట్టుదలతో బయటికి వచ్చేలా చేశారు. ఇప్పుడిది హిట్టా ఫ్లాపా అనేది దసరా రిలీజయ్యేలోపు తేలిపోవాలి. మార్చి 30నాటికి మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ తీసేస్తారు కాబట్టి ఒకవేళ రంగమార్తాండకు జనాలు పెరగడం మొదలైతే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవచ్చు. ఇంకో నాలుగైదు రోజులు వెయిట్ చేయాలి.