పుష్ప-2 మెరుపు రెడీ అవుతోంది


ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న వాటిలో మోస్ట్ అవైటెడ్ అనదగ్గ చిత్రాల్లో పుష్ప-2 ఒకటి. ఏడాదిన్నర కిందట విడుదలైన ‘పుష్ప’ తెలుగుతో పాటు వివిధ భాషల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ సినిమా ఇరగాడేసింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్.. పాటలు అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాయి. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. కొన్ని నెలల కిందటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. దాదాపు 20 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షూట్ ఆపి.. ‘పుష్ప-2’ ఫస్ట్ గ్లింప్స్ మీద వర్క్ చేస్తోందట చిత్ర బృందం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతోంది టీం. ప్రస్తుతం సుకుమార్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ టీజర్ మీద వర్క్ చేస్తున్నాడు. బన్నీ డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే.. ఒక వెరైటీ కాన్సెప్ట్‌తో టీజర్ షూట్ చేశాడట సుకుమార్. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ టీజర్ ఉంటుందని సమాచారం. దీంతో పాటు బన్నీని ఒక సంచలన అవతారంలో చూపిస్తూ ఫొటో షూట్ కూడా చేసింది టీం. ఆ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని సమాచారం. ఐతే దీన్ని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేయాలా.. లేక ఇంకొన్ని నెలలు అట్టిపెట్టి రిలీజ్ టైంలో రిలీజ్ చేయాలా అని సుకుమార్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది.

టీజర్, ఫస్ట్ లుక్ రెండూ రిలీజ్ చేస్తే మాత్రం బన్నీ అభిమానులకు పండగే. బన్నీ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు వీటిని రిలీజ్ చేసే అవకాశముంది. ఒక రెండ్రోజులు ఇండియన్ సినిమాలో ఇది తప్ప వేరే టాపిక్ ఉండని విధంగా సెన్సేషనల్‌గా టీజర్, ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నాడట సుకుమార్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా.