యూనివర్శిటీలో వర్మ పైత్యం

రాంగోపాల్.. వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడే బహుకొద్ది మంది తెలుగువారిలో ఆయన ఒకరు. ఏ సర్టిఫికెట్ సినిమాలు తీయడం, నాన్ వెజ్ డైలాగులు వదలడంలో వర్మతో ఎవరూ పోటీ పడలేదు. ఏ పనైనా నా ఇష్టం అన్నట్లుగా చేస్తారాయన. అభ్యంతరం చెప్పిన వారిపై ఎదురుదాడి ఖాయమని కూడా గ్రహించాలి. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఐదు వేల కుక్కల మధ్య వదలాలని ఇటీవల వర్మ ఒక సంచలన కామెంట్ చేశారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వర్మ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. యూనివర్శిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తన సహజ ధోరణిలో సమాధానమిచ్చారు. టీచర్లు, తల్లిదండ్రులు పెట్టే ఆంక్షలను పట్టించుకోకుండా తమకు నచ్చిన విధంగా ఉండాలని విద్యార్థులకు వర్మ హితబోధ చేశారు. ఏ పనైనా చేయకూడదన్న రూల్ లేదని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు బతకాలని వర్మ సూచించారు.

నచ్చింది తినాలని, తాగాలనుకుంది తాగాలని, ఇష్టం వచ్చినప్పుడు సెక్స్ చేయాలని వర్మ చెప్పుకొచ్చారు. పైగా ముందు బెంచ్ విద్యార్థులు పైకి రారని, తనలాంటి బ్యాక్ బెంచ్ వాళ్లే జీవితంలో పైకి వస్తారని వర్మ చెప్పుకున్నారు. హార్డ్ వర్క్ చేసి ప్రయోజనం లేదని, అందరూ స్మార్ట్ వర్క్ చేయాలని వర్మ విశ్లేషించారు.

ఆత్మహత్యలు, చావులపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించారు. చచ్చిపైకి పోతే అక్కడ రంభా, ఊర్వశిలు మన కోసం వెయిట్ చేస్తుంటారని, హాయిగా ఎంజాయ్ చేయవచ్చని సూచించారు. వైరస్ వచ్చి మగజాతి అంతా అంతమై, తాను ఒక్కడినే మిగలాలన్నది చిరకాల వాంఛగా చెప్పుకున్నారు. జీఎస్టీ -2 ఎప్పుడు వస్తుందని విద్యార్థులు అడిగితే… మీ దగ్గరున్న సెల్ ఫోన్లలోనే తీసుకోవచ్చని వర్మ సలహా ఇచ్చారు. అయితే వర్మ చేసిన సెక్సీయిస్ట్ కామెంట్స్ కు విద్యార్థినులు కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం..

వర్మతో ఒక ప్రోగ్రాం పెట్టించిన నాగార్జున యూనివర్శిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజశేఖర్ గతంలో కూడా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు..