అంకెల గారడీలు చేస్తున్న విజయ్ సూర్య

స్టార్ హీరోల సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరగాలంటే దానికి హైప్ చాలా ముఖ్యంగా. దీన్ని ఎంతగా పెంచితే అంతగా క్రేజ్ వచ్చి బయ్యర్లు మతిపోయే రేట్లను ఆఫర్ చేస్తారు. ఇది ఏ మాత్రం తేడా వచ్చినా ఒక్కోసారి పెట్టుబడి కూడా వెనక్కు రాదు. అందుకే నిర్మాతలు పిఆర్ టీమ్ లు సోషల్ మీడియానో ఆయుధంగా వాడుకుంటారు. కోలీవుడ్ లో ఈ పోకడ కొత్త దారులు వెతుకుతోంది. కొద్దిరోజుల క్రితం విజయ్ నటిస్తున్న లియోకి ఏకంగా 400 కోట్ల బిజినెస్ జరిగిందనే వార్తలు చెన్నైలోనే కాదు హైదరాబాద్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొట్టి హాట్ డిస్కషన్ గా మారాయి.

ఎంత ఖైదీ, విక్రమ్ తీసిన లోకేష్ కనగరాజ్ డైరెక్టరైనా మరీ ఇంత డిమాండా అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. తాజాగా సూర్య హీరోగా రూపొందుతున్న తన ఇరవై నాలుగవ సినిమాకు ఏకంగా 500 కోట్ల ఆఫర్లు వచ్చాయని తమిళ విశ్లేషకులు తెగ ప్రమోట్ చేస్తున్నారు. అక్కడికి దీన్నేదో రాజమౌళినో ప్రశాంత్ నీలో డైరెక్ట్ చేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు. దీని దర్శకుడు సిరుతై శివ ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. రజనీకాంత్ అంత సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తే పెద్దన్న రూపంలో ఒక రొటీన్ మసాలా డిజాస్టర్ ఇచ్చిన ఘనత స్వంతం. అజిత్ తో మాత్రమే ఇతనికి హిట్లున్నాయి.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో పాటు పది రకాల వేషాలు వేస్తున్నాడు కాబట్టి సూర్య కోణంలో దీని మీద అంచనాలు ఉండొచ్చు కానీ మరీ ఇలా వందల కోట్ల ఫిగర్స్ ని ట్విట్టర్ లో ప్రమోట్ చేయడమే విచిత్రంగా ఉంది. పొన్నియన్ సెల్వన్ 1 కూడా ఇదే తరహాలో రుద్దబోయారు కానీ తమిళనాడు తప్ప బయట ఎక్కడా అది అద్భుతాలు చేసిన దాఖలాలు లేవు. పైగా తెలుగు వెర్షన్ టీవీలో వస్తే దారుణమైన రేటింగ్స్ నమోదయ్యాయి. బాహుబలిని ఆర్ఆర్ఆర్ ని దాటిపోయామనే రేంజ్ లో చెప్పుకోవాలనే తాపత్రయం తప్ప ఈ లెక్కల్లో నిజాలేంటో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.