నాని కూడా ఆ లీగ్‌లోకి వచ్చేశాడబ్బా..

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నేచురల్ స్టార్ నాని రేంజ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతడి సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి. బిజినెస్ కూడా పెరుగుతోంది. నాని కొత్త చిత్రం ‘దసరా’ మీద ఏకంగా 60 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్లు వార్తలు వస్తుండగా.. దాని బిజినెస్ రూ.80 కోట్ల మార్కును టచ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ముందు నిర్మాత సుధాకర్ చెరుకూరి బడ్జెట్ పెరిగిపోవడం చూసి చాలా భయపడ్డాడట కానీ.. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్, సినిమాకు జరిగిన బిజినెస్‌తో ఆయన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాకు మంచి క్రేజ్ రావడంతో వచ్చే నెల రోజుల్లో అగ్రెసివ్ ప్రమోషన్లతో సినిమా మీదున్న హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇందుకోసం నిర్మాతతో సంబంధం లేకుండా నాని ఖర్చు పెట్టుకుని వ్యక్తిగతంగా చాలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ అభిమాన సంఘాలను మెయింటైన్ చేయడం.. సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇప్పించుకోవడం.. బయట తన సినిమాలకు సంబంధించి కానీ. పుట్టిన రోజు సెలబ్రేషన్లు భారీగా చేయడం లాంటివి నాని చేసేవాడు కాదు. అలాంటివి నానికి పెద్దగా ఇష్టం ఉన్నట్లు కనిపించేది కాదు. కానీ ఎలాంటి హీరో అయినా ట్రెండును అనుసరించి పోవాల్సిందే.

నిన్నా మొన్నా వచ్చిన హీరోలు కూడా సోషల్ మీడియాలో పీఆర్ టీంలు, బ్యాచ్‌లను పెట్టి ఎంత హడావుడి చేస్తున్నారో తెలిసిందే. ఇప్పుడు ఇలాంటివి చాలా అవసరం లాగా మారిపోవడంతో నాని కూడా ఇందులోకి దిగక తప్పట్లేదు. తన 39వ పుట్టిన రోజును పురస్కరించుకుని 39 లొకేషన్లలో భారీగా వేడుకలు ప్లాన్ చేయించడం విశేషం.

మామూలుగా నాని బర్త్‌డే అంటే పెద్ద హడావుడేమీ కనిపించదు. కానీ ఈసారి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో హంగామా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘దసరా’తో పాన్ ఇండియా స్థాయికి ఎదగగలనని ధీమాగా ఉన్న నాని.. దానికి ముందు తనకు కొంచెం ఎలివేషన్ ఇచ్చుకోవడం అవసరమని పీఆర్ టీంలతో కలిసి కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు హీరోగా నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్‌గా నిలిచిన ‘అలా మొదలైంది’ సినిమా రీ రిలీజ్ కూడా ప్లాన్ చేయడం విశేషం.