రిషబ్‌ను దాటి అవార్డు వస్తుందా?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుకు బలమైన పోటీదారు కాబోతున్నాడని.. అతను అవార్డు గెలిచేసినా ఆశ్చర్యం లేదని మీడియా, సోషల్ మీడియా ఇటీవల బాగా హడావుడి జరిగింది. తీరా చూస్తే.. అవార్డు గెలవడం సంగతి అటుంచితే నామినేషన్ కూడా సంపాదించలేకపోయాడు తారక్.

ఇక తారక్ అభిమానుల దృష్టి జాతీయ అవార్డుల మీద పడింది. గత సంవత్సరానికి గాను త్వరలోనే జాతీయ అవార్డులను ప్రకటించే అవకాశాలున్నాయి. కొమరం భీముడో పాటలో అద్భుత అభినయం ఒక్కటి చాలు తారక్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు రావడానికి అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా తారక్‌కు అవార్డు గ్యారెంటీ అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తారక్‌కు అడ్డుగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి కనిపిస్తున్నాడు.

తాజాగా ‘కాంతార’లో అద్భుత నటనకు గాను మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా ముంబయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ శెట్టి సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు.. రిషబ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాదికి సంబంధించి ఉత్తమ నటుడిగా ఏ అవార్డు అయినా రిషబ్‌కే చెందాలని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి అక్కడి వారిలో ఒకింత అక్కసు కూడా ఉన్న మాట వాస్తవం. ‘బాహుబలి’ని నెత్తిన పెట్టుకున్నట్లు వాళ్లు ‘ఆర్ఆర్ఆర్’ను పెట్టుకోలేదు. ఇక ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం సైతం ఆస్కార్ అవార్డులకు ప్రతిపాదించలేదు.

ఈ నేపథ్యంలో జాతీయ అవార్డుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’కు ప్రాధాన్యం దక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ‘కాంతార’లో రిషబ్ పెర్ఫామెన్స్‌ను ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆ నటనకు సర్ప్రైజ్ కాని వారు లేరు. తారక్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో గొప్పగా నటించినా.. ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చిన రిషబ్‌కే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కట్టబెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.