ఒక్క అడుగు వెనక్కు తగ్గిన విష్ణు కథ

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా వినరో భాగ్యము విష్ణు కథ ముందు చెప్పిన డేట్ ప్రకారమైతే ఈ నెల 17 విడుదల కావాల్సింది. ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే విషయం స్పష్టం చేశారు. అయితే కొన్ని పునరాలోచనల తర్వాత ఒక రోజు ఆలస్యంగా అంటే18కి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలిసింది. ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే ధనుష్ సార్ ని సితార సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. న్యూట్రల్ గా ఉండే మూవీ లవర్స్ ఒక్కదానికే ఓటు వేసే పక్షంలో ఓపెనింగ్స్ పరంగా రెండింటికీ ఇబ్బందే. పైగా మార్కెట్ పరంగా చూసుకున్నా క్లాష్ కావడం అనవసరమైన రిస్కు.

అఫీషియల్ గా ఇవాళో రేపో చెప్పేస్తారని సమాచారం. కిరణ్ అబ్బవరం దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది చావో రేవో అనే పరిస్థితి. గత ఏడాది మూడు ఫ్లాపులు పలకరించేసరికి దాని ప్రభావం కుర్రాడి మీద గట్టిగా పడింది. సోషల్ మీడియా ట్రోల్స్ సంగతి పక్కనపెడితే కెరీర్ ఎదుగుతున్న దశలో వరస పరాజయాలు పెద్ద స్థాయికి చేరుకోకుండా అడ్డు పడతాయి. అసలే ఆది సాయికుమార్ లాంటి వాళ్ళు కౌంట్ పరంగా ఎన్ని సినిమాలు చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం కలగడం లేదు. అందుకే కంటెంట్ కనిపిస్తున్న విష్ణు కథ రిస్క్ తీసుకోకపోవడమే మంచిది.

ఇంతే కాదు గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా 17నే వస్తోంది. అదేమీ తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ కాదు కానీ బిజినెస్ వ్యవహారాలైతే చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని లేదా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చేందుకు నిర్మాత బన్నీ వాస్ ప్లానింగ్ లో ఉన్నారు. అటుపక్క సార్ ప్రొడ్యూసర్లకు సైతం పవర్ స్టార్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంది. ఒక రోజు వాయిదా కిరణ్ కు ఎలాంటి లక్కు తీసుకొస్తుందో చూడాలి.