పొరుగు నెంబరు విష్ణు ప్రేమకథ

ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ప్రేక్షకుల మెప్పు పొందటమే కాదు ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోనూ పడ్డ కిరణ్ అబ్బవరంకు గత ఏడాది అంతగా అచ్చి రాలేదు. సెబాస్టియన్ షాక్ ఇవ్వగా సమ్మెతమే పూర్తి సమ్మతాన్ని పొందలేకపోయింది. ఇక నేను మీకు బాగా కావాల్సినవాడిని ఏకంగా ట్రోలింగ్ కు దారి తీసింది. అయినా కూడా మంచి అవకాశాలు ఒడిసిపట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఈ కుర్రాడికి ఈసారి ఏకంగా గీతా ఆర్ట్స్ అండ దొరికింది. ట్రైలర్ లాంచ్ లో అల్లు అరవింద్ తనను ఒక్కడినే ప్రత్యేకంగా పొగిడారంటేనే ఏదో విషయం ఉన్నట్టే. సాయి ధరమ్ తేజ్ గెస్టుగా ఈ ఈవెంట్ జరిపారు.

కథేమీ దాచకుండా చెప్పేశారు. తిరుపతిలో ఉండే ఓ మంచి కుర్రాడు విష్ణు(కిరణ్ అబ్బవరం). అతనికి పరిచయమే లేని దర్శన(కాశ్మీర) నుంచి ఫోన్ వస్తుంది. తన సెల్ ఫోన్ నెంబర్ చివర్లో వచ్చే సంఖ్య తర్వాత నెంబర్ ని మార్చుకుని ఆ అమ్మాయి విష్ణుకి చేస్తుంది. అలా ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారుతుంది. ఈలోగా ఓ స్థానిక రాజకీయ నాయకుడి వల్ల దర్శన కుటుంబం ప్రమాదంలో పడితే విష్ణు వాళ్లకు అండగా నిలబడటమే కాదు అవసరమైతే కొట్టేందుకు కూడా సిద్ధపడతాడు. ట్విస్టులు షాకులు చాలానే వస్తాయి. మరి వీళ్ళ ప్రయాణం ఎక్కడికి చేరుకుందనేది తెరమీద చూడమంటున్నారు.

కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. మురళి కిషోర్ అబ్బూరు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ని టార్గెట్ చేసేలా అవసరమైన అన్ని అంశాలు పొందుపరిచినట్టు కనిపిస్తోంది. ఇంకో పక్క నెంబర్ తో హీరోయిన్ ని సరదాగా అల్లరి పెట్టే పాత్రలో మురళి శర్మకు కామెడీ బాధ్యతను ఇచ్చారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, డానియెల్ విశ్వాస్ ఛాయాగ్రహణం మంచి ఫీల్ నే కలిగించాయి. మొత్తానికి వర్కౌట్ అయ్యే మ్యాటరైతే ట్రైలర్ లో చూపించారు. ఇదే మోతాదులో ఫుల్ మూవీ ఉంటే మాత్రం కిరణ్ మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టే. అది తేలాలంటే 17 దాకా వెయిట్ చేయాలి.