45 రోజులకే OTT వీరయ్య

2024 సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్ బస్టర్ తో పాటు విన్నర్ ట్యాగ్ ను అందుకున్న వాల్తేరు వీరయ్య అర్ధ శతదినోత్సవం దాటకుండానే ఓటిటిలో వచ్చేస్తోంది. ఫిబ్రవరి 27 నుంచి ప్రీమియర్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది. ఇటీవల పాతిక రోజుల సంబరం పూర్తి చేసుకున్న ఈ మెగా మాస్ మూవీకి చాలా కేంద్రాల్లో ఇప్పటికీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మొన్న ఆదివారం మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడటమే దానికి నిదర్శనం. ఫిఫ్టీ డేస్ ని గ్రాండ్ గా చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

ఈలోగా ఇప్పుడీ అనౌన్స్ మెంట్ తో ఎంత లేదన్నా బ్యాలన్స్ వచ్చే మరికొన్ని వసూళ్లకు ఎంతో కొంత గండి పడుతుంది. వీక్ డేస్ లో ఆల్రెడీ బాగా నెమ్మదించేసిన వాల్తేరు వీరయ్యను నలభై అయిదు రోజుల కండీషన్ మీద నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుంది. గతంలో గాడ్ ఫాదర్ విషయంలోనూ ఇంతే నిడివిని పాటించింది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ముందే డేట్ ని ఫిక్స్ చేసుకుంటారు. తెలుగుతో పాటు హిందీ తమిళ వెర్షన్లను కూడా అందుబాటులోకి తేబోతున్నారు. ఇటీవలే కొత్త రిలీజుల విషయంలో దూకుడు పెంచిన నెట్ ఫ్లిక్స్ ఈ వాల్తేరు వీరయ్య మీద వ్యూస్ పరంగా భారీ అంచనాలు పెట్టుకుంది.

ఇదంతా ఓకె కానీ గత ఏడాది కొత్త సినిమాలకు కనీసం తొంబై రోజుల ఓటిటి గ్యాప్ ఉండే తీరాలని నిర్మాతలు చేసుకున్న ఏకగ్రీవ ఒప్పందం తూచ్ అయినట్టే కనిపిస్తోంది. గత అయిదారు నెలలుగా ఎవరూ ఈ కండీషన్ ని పాటించడం లేదు. ఒకవేళ కట్టుబడి ఉండాలన్నా ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లు తాము ఆఫర్ చేస్తున్న మొత్తంలో భారీ కోతలు పెడుతుండటంతో రెండు నెలలకు పొడిగించడం కూడా అవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నెలన్నర గ్యాప్ కు ఓటేస్తున్నారు. వాల్తేరు వీరయ్య ప్రకటన రావడంతో నెక్స్ట్ వీరసింహారెడ్డి డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీని హక్కులు హాట్ స్టార్ సొంతం చేసుకుంది.