ఇంతకుముందు రెండు ఫ్యామిలీల హీరోల మధ్యే ఫ్యాన్ వార్స్ నడిచేవి. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు.
నందమూరి ఫ్యామిలీలో బాలయ్య, ఎన్టీఆర్ అభిమానుల మధ్య గొడవలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా తయారై మిగతా మెగా హీరోల అభిమానులతో గొడవలు పడుతున్నారు.
కొన్ని నెలల కిందట రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు ఎంతగా దిగజారిపోయి సోషల్ మీడియాలో దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి గొడవలు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ మరింత కింది స్థాయికి వెళ్లిపోయాయి. ఎప్పడూ కలిసి మెలిసి సాగే.. అందరూ ఒక్కటే అన్నట్లు ఉండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఇప్పుడు చిచ్చు రేగింది.
ఓవైపు బాబాయ్-అబ్బాయ్ ఎంత సన్నిహితంగా ఉంటారో.. చరణ్‌కు పవన్ అంటే ఎంత గౌరవమో, చరణ్ అంటే పవన్‌కు ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. కానీ ఇదంతా పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో పవన్, చరణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు కొన్ని రోజులుగా. దీని మీద ఇప్పుడు స్పేస్‌లు పెట్టి బూతులు తిట్టుకునే వరకు వెళ్లిపోయింది పరిస్థితి. ఇక్కడ రాయడానికి వీల్లేని భాషలో పరస్పరం అభిమానులు పవన్, చరణ‌్‌లను దూషిస్తుండడం గమనార్హం.
రామ్ చరణ్‌కు సొంత ఫ్యాన్ బేస్ లేదట, పవన్ ఫ్యాన్సే అతణ్ని మోస్తున్నారట. చరణ్ పినిమాకు బేనర్లు కట్టేది కూడా పవన్ అభిమానులేనట.. ఇదీ పవన్ ఫ్యాన్స్ వాదన.
ఇంకో వైపు చరణ్ అభిమానులేమో.. పవన్ కూడా చిరు వల్లే స్టార్ అయ్యాడని, పవన్ కంటే చరణ్ చాలా సిన్సియర్‌గా సినిమాలు చేస్తున్నాడని.. పవన్ కోసం ఏం చేయడానికైనా చరణ్ సిద్ధంగా ఉంటాడని వాదిస్తున్నారు.
ఈ వాదనతో పాటు బూతులు తిడుతూ హీరోలను దూషిస్తున్నారు. ఫ్యాన్ వార్స్ మరీ ఒకే కుటుంబంలో ఎంతో సన్నిహితంగా ఉండే హీరోల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి వెళ్లిపోవడం బాధాకరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates