ఆర్ఆర్ఆర్ చేతికి బంగారు టమాటో

ఆస్కార్ వచ్చే దాకా ఆర్ఆర్ఆర్ అవార్డుల ప్రయాణం ఆగేలా కనిపించడం లేదు. దేశవిదేశాల్లో జక్కన్న ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. విచిత్రంగా దీని థియేట్రికల్ రన్ ఇండియాలో ఎప్పుడో పూర్తయినప్పటికీ జపాన్ లాంటి చోట్ల వంద రోజులకు వెళ్తున్నా సరే హౌస్ ఫుల్ బోర్డులు పడుతూనే ఉన్నాయి. నాటు నాటుకి గోల్డెన్ గ్లొబ్ పురస్కారంతో పాటు ఆస్కార్ నామినేషన్ దక్కడంతో మూవీ లవర్స్ ఖచ్చితంగా దీన్ని బిగ్ స్క్రీన్ మీదే ఎక్స్ పీరియన్స్ చేసే ఉద్దేశంతో ఎక్కడ ప్రీమియర్లు పడుతున్నా సరే టికెట్లు కొనేస్తున్నారు. ఇప్పటికీ యుఎస్ లో ఎన్కోర్ పేరుతో వేస్తున్న స్పెషల్ షోలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది.

తాజాగా సుప్రసిద్ధ అమెరికన్ రేటింగ్ సైట్ గా ప్రసిద్ధి గాంచిన రాటెన్ టమాటోస్ లో ఆర్ఆర్ఆర్ కు ఫ్యాన్ ఫేవరెట్ మూవీ 2022గా అత్యధిక అభిమానులు ఓటు వేయడంతో గోల్డెన్ టమాటో దక్కింది. అధికారికంగా ట్విట్టర్ లో దీన్ని సదరు సంస్థతో పాటు ట్రిపులార్ టీమ్ అఫీషియల్ గా ట్వీట్ చేశాయి. ప్రపంచంలో ఏ భాషలో ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా దానికి ఈ రాటెన్ రివ్యూలు రేటింగ్స్ ని ఎంతో కీలకంగా పరిగణిస్తారు. చాలా సందర్భాల్లో సదరు చిత్రాల శాటిలైట్ హక్కులు, రీ రిలీజ్ రైట్స్ కు సంబంధించిన నిర్ణయాలు కూడా వీటిని అనుసరించి చేసే ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఉన్నాయి.

ట్విట్టర్ లో ఈ రాటెన్ టొమాటోస్ కి రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. అన్నింటికి మించి వాకండ ఫరెవర్, అవతార్ ది వే అఫ్ వాటర్, టాప్ గన్ మావరిక్, జురాసిక్ వరల్డ్ డామినియన్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్లను కాదని పబ్లిక్ ఆర్ఆర్ఆర్ కి ఓటు వేయడం ఎంతైనా గర్వకారణం. ఇంకో నెలన్నరలో జరగబోయే అకాడమీ ఈవెంట్ లోనూ ఈ సినిమాకు తగినంత గౌరవం దక్కుతుందని ఇంటర్నేషనల్ మీడియా సైతం ఎదురు చూస్తోంది. త్వరలో యానివర్సరీ పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ట్రిపులార్ ని మరోసారి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు టాక్.