కీర్తి సురేష్.. వన్ అండ్ ఓన్లీ

ఒక దశాబ్దం ముందు వరకు దక్షిణాదిన ప్రతి కథానాయికా కచ్చితంగా పని చేయాలనుకునే కథానాయకుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌ కచ్చితంగా ఉండేవాళ్లు. ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.

ఇప్పుడు వయసు వాళ్లకు ఎక్కువైంది కాబట్టి కథానాయికగానే చేయాలన్న రూల్ కూడా ఏమీ ఉండదు. కానీ ఒకసారి వాళ్లతో నటిస్తే చాలనుకుంటారు. ఆ అవకాశం దక్కించుకున్న ఈ తరం కథానాయిక కీర్తి సురేష్ ఒక్కరే అన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఆమె ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తోంది. అందులో ఆమెది రజనీకి జోడీగా కనిపించే పాత్రా.. ఇంకోటా అన్నది తెలియదు. ఎలాగైతేనేం రజనీతో నటించాలన్న కోరిక తీరుతోంది.

ఈ ఊపులోనే కీర్తి.. కమల్ హాసన్‌తో నటించే అవకాశాన్ని కూడా పట్టేసిందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్ ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు. సెట్లో యాక్సిడెంట్, ఆ తర్వాత కరోనా వల్ల ఆ చిత్రం ఆలస్యమవుతోంది. ఈలోపు కమల్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో రాఘవన్) సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

దీనికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. ఈ చిత్రంలో కీర్తిని కథానాయికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ తరంలో రజనీ, కమల్‌లతో కలిసి నటించిన ఏకైక తారగా కీర్తి రికార్డు సృష్టిస్తుంది. చివరగా ఈ ఘనత సాధించిన హీరోయిన్ త్రిషనే. ‘మన్మథబాణం’ చిత్రంలో కమల్‌తో నటించిన ఆమె.. గత ఏడాది వచ్చిన ‘పేట’లో తొలిసారిగా రజనీకి జోడీగా కనిపించింది.